ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో నివశిస్తూ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఇళ్ల కోసం డబ్బుల చెల్లించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల లోపు ఇళ్ల కోసం గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. కేవలం ఒక్క రూపాయికే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయనుంది. లబ్ధిదారులు బ్యాంకులకు 20 ఏళ్లపాటు నెలకు రూ.2వేలు చెల్లించాల్సిన అవసరం లేదని.. దీనికి సంబంధించిన వ్యయమంతా ప్రభుత్వమే భరించనుంది.
ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,43,600 మందికి లబ్ధి చేకూరనుండగా.. ప్రభుత్వంపై రూ.3వేల కోట్లకు పేగా భారం పడనుంది. అలాగే 365 చదరపు అడుగుల ఇంటికి రూ.50 వేలకు బదులు రూ.25వేలు చెల్లిస్తే సరిపోతుందని.. 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్షకు బదులు రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే నగదు చెల్లించి ఉంటే 50శాతం మినహాయించి మిగిలిన మొత్తం లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించనుంది. టిడ్కో కాలనీలకు వైఎస్ జగనన్న నగర్ గా నామకరణం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం పొంది.. టిడ్కో లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారి నుంచి ఫ్లాట్ వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక టిడ్కో ఇళ్ల పథకంలో లబ్ధిదారులు కానివారికి సైతం రాష్ట్ర ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. వైయస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే పథకంలో ప్రైవేట్ వెంచర్లను భాగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రైవేట్ లే అవుట్లలో 5శాతం స్థలాన్ని కేటాయించేలా చట్టసవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.