ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై రచ్చ ప్రారంభం అయ్యింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు ఆంక్షలు విధించింది. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. వీరితో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయించొద్దని సూచించారు. వాలంటీర్లు పార్టీలు, అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇక వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని.. మొబైల్స్ స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఎస్ఈసీ ఆదేశాలపై లంచ్ మోషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఎస్ఈసీతో సమావేశంలో వైఎస్సార్‌సీపీ దీనిపై అభ్యంతరం తెలిపింది. వాలంటీర్ల హక్కులు కాలరాయొవద్దని, హక్కులను కాపాడాలని కోరినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాలని ఆదేశాలపై అభ్యంతరాలు తెలిపారు. వాలంటీర్లను నిర్భంధించినట్లు అవుతుందన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరి నుంచి అధికార పక్షానికి సహకరించారని ఫిర్యాదులు చేశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.