వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పార్టీ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశాయి. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో దాదాపు 18 రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. 3211 కిలోమీటర్లు నడిచినపుడు, జనసందోహం మధ్య ఉన్నపుడు జరగని హత్యాయత్నం హై సెక్యురిటీ ప్రాంతమైన విమానాశ్రయంలో జరగటం విచిత్రంగా ఉంది. హత్యాయత్నం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.
పాదయాత్రలో పాల్గొనకూడదని డాక్టర్లు చెప్పిన సలహాలతో రెండుసార్లు వాయిదా వేసుకున్న జగన్ ఇక ఉండలేకపోయారు. గాయం ఇంకా పూర్తిగా మానకపోయినా సరే అలాగే అర్ధాంతరంగా ఆగిపోయిన పాదయాత్రను ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర ఆగిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. నిజానికి పాదయాత్ర మొదలైన దగ్గర నుండి జగన్ భద్రతపై వైసిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలో పాదయాత్ర సాగుతున్నపుడు భద్రతలోని డొల్లతనం బయటపడింది. అయినా ప్రభుత్వం జగన్ భద్రతను పెంచలేదు.
మొత్తానికి వైసిపి నేతలు ఆందోళన పడుతున్నట్లుగానే విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగటంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. 18 రోజుల విశ్రాంతి తర్వాత జగన్ మళ్లీ సోమవారం నుండి పాదయాత్ర ప్రారంభిస్తుండటంతో భద్రత ప్రభుత్వానికి తలనొప్పులైపోయింది. జిల్లా ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ, జగన్ పాదయాత్రకు మూడంచెల భద్రత కల్పించనున్నట్లు చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వటానికి, సెల్ఫీలు తీసుకోవటానికి అనుమతించేది లేదని చెప్పారు.
అంటే జగన్ తో ఎవరైనా సెల్ఫీలు తీసుకోవాలన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా దాదాపు అసాధ్యమనే చెప్పాలి. భద్రత పేరుతో జనాలను జగన్ కు దూరం చేసే కుట్ర ఏమైనా ఉందేమో చూడాలి. అదే సమయంలో ఎవరుపడితే వారు జగన్ తో కలిసి నడవటానికి కూడా పోలీసులు అనుమతించరు. దానికితోడు జగన్ వ్యక్తిగత భద్రత, పార్టీ పరంగా కూడా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారమేతే జగన్ పాదయాత్ర అత్యంత భద్రత నడుమ మొదలవ్వనున్నది. మరో నెలరోజుల్లో పాదయాత్ర ముగుస్తోంది. ఈ సమయంలో జగన్ కోసం తీసుకుంటున్న భద్రతా చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.