ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం దుమారం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ ఈ సీ షెడ్యూల్ విడుదల చేయగా.. ఆ అవకాశమే లేదంటూ ప్రభుత్వం నో అంటుంది. తాజాగా ఎస్ ఈ సీ ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది.. సంక్రాంతి సెలవులు కావడంతో హౌస్ మోషన్ దాఖలు చేయనుంది. న్యాయపరమైన పత్రాలను సిద్ధం చేసి.. ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి ఇంటి దగ్గరే హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది.
కరోనా వ్యాక్సిన్ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పేందుకు సిద్ధమైంది. ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించేందుకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించేసింది. ఎన్నికల కోడ్ కూడా శనివారం నుంచి అమల్లోకి వస్తోందని తేల్చి చెప్పింది. నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.
ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13 మూడో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.