విజయసాయికే పెద్ద పీట

వైసిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికే జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిని నియమిస్తు జగన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. విజయసాయికి పెద్ద పదవి వస్తుందని అందరూ ఊహించిందే కానీ ఇదే పదవి అంటూ జగన్ ఎక్కడా చెప్పలేదు.

అలాగే రెండోసారి లోక్ సభకు ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేశారు. పార్టీ తరపున 22 మంది లొక్ సభకు ఎన్నికైనా చాలామంది కొత్తవారే. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా ఉండే మిథున్ కు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేయటంపై మిగిలిన నేతలు హ్యాపీగానే ఉన్నారు.

అలాగే మొదటిసారి ఎన్నికైన మార్గాని భరత్ ను లోక్ సభ చీఫ్ విప్ గా ఎంపిక చేశారు. కాకపోతే చిన్న వయసులోనే భరత్ కు పెద్ద పదవి ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. భరత్ మొదటిసారి ఎంపి అయ్యాడు. భరత్ తో పాటు చాలామంది మొదటిసారి ఎన్నికైన వారిలో వయసు రీత్యా పెద్ద వాళ్ళు చాలామందున్నారు.

ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మూడోసారి ఎంపిగా ఎన్నికయ్యారు. కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్, విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ లాంటి చాలామంది మొదటసారే అయినా వయసులో పెద్ద వారే. కానీ వారందరినీ కాదని భరత్ కు పదవి ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.