జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

నిజంగా జగన్మోహన్ రెడ్డికి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రకటించిన 25 మంది లోక్ సభ అభ్యర్ధుల్లో నలుగురు మహిళలకు టికెట్లు కేటాయించటమంటే మాటలు కాదు. అందులోను ముగ్గురు ఎన్నికలకు కొత్తవారే కావటం గమనార్హం. ఈ నలుగురిలో కూడా ఇద్దరు రిజర్వుడు క్యాటగిరి వాళ్ళు కాగా మరో ఇద్దరు ఓపెన్ క్యాటగిరీకి చెందిన వాళ్ళు. విశాఖపట్నం జిల్లాలోని అరకు లోక్ సభ అభ్యర్ధిగా గొడ్డేటి మాధవి పోటీ చేస్తున్నారు. ఈమె  మాజీ ఎంఎల్ఏ దేముడు కూతురు.

ఏజెన్సీ ప్రాంతమైన అరకులో చాలా కాలంగా  ఓ స్వచ్చంధ సంస్ధ నిర్వహిస్తున్నారు. మాధవికి నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో, గూడేల్లో చాలామందితో వ్యక్తిగత సంబంధాలుండటం సానుకూలమయ్యేదే. టిడిపి తరపున పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తో పోటీ పడుతున్నారు. అంత్యంత సీనియర్ నేత కిషోర్ కు మొదటిసారి పోటీ చేస్తున్న మాధవికి పోటీ రసవత్తరంగా జరిగే అవకాశాలే ఎక్కువున్నాయి.

ఇక, కాకినాడలో సీనియర్ నేత వంగాగీత పోటీ చేస్తున్నారు. ఈమెకు రాజకీయ అనుభవం బాగానే ఉంది. కాకపోతే వైసిపిలో చేరిన రెండు రోజులకే ఎంపి టికెట్ దక్కించుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ టిడిపి, జనసేన అభ్యర్ధులను కాపు సామాజికవర్గానికి చెందిన గీత ఢీ కొనబోతోంది. అలాగే, అనకాపల్లి పార్లమెంటుకు డాక్టర్ వెంకట సత్యవతి పోటీ చేస్తున్నారు. ఈమె కూడా మొదటిసారి పోటీ చేస్తున్నారు.

అమలాపురం నుండి చింతా అనూరాధ కూడా మొదటిసారి ఎన్నికల్లో పాల్టొంటున్నారు. ఈమె రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండే వచ్చారు. ఈమె తండ్రి చింతా కృష్ణమూర్తి రెండుసార్లు పోటీ చేశారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో వైసిపికి గెలుపు ఎంత అవసరమో అందరికన్నా జగన్ కే బాగా తెలుసు. అటువంటిది నలుగురు మహిళలను పోటీలోకి దింపారంటే హ్యట్సాఫ్ టు జగన్ అనాల్సిందే.