తూర్పు గోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్ పై క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదన్నారు జగన్. తూ.గో జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాపు రిజర్వేషన్ సమస్య గురించి ఆయన ఇలా మాట్లాడారు. నేను మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాను. చేయగలిగింది మాత్రమే చెబుతాను. చేయలేనిది నాకు చెప్పే అలవాటు లేదని స్పష్టం చేశారు.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలు ఉంటాయి, కొన్ని రాష్ట్ర పరిధి కాని అంశాలు ఉంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్ సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం దాటితే సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో లేని అంశాలు కాబట్టి వీటి మీద నేను ఏమి చేయలేను. అందుకే మీ అందరి సమక్షంలో నేను చేయలేను అని మొహమాటం లేకుండా చెబుతున్నాను.
మొదటసారి కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పింది నేనే అని చెప్పటానికి వెనుకడుగు వేయట్లేదు. చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి ఐదు వేల కోట్లు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారని జగన్ మండి పడ్డారు. చంద్రబాబు ఇస్తానని చెప్పి ఇవ్వని ఐదువేల కోట్లకంటే రెట్టింపు నిధులు ఇస్తానని కాపులకు హామీ ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హామీ నెరవేర్చుకుంటాను అన్నారు జగన్.