సోనియా దయతోనే జగన్ సిఎం అయ్యారా ?

అలాగని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు అంటున్నారు. హనుమంతరావు ఇచ్చిన ప్రకటనలో ఎంత వరకూ నిజముందో వైసిపి అభిమానులకు, కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. జగన్ సిఎం కావటానికి సోనియా గాంధికి ఆవకాయకు ఆవగింజకు ఉన్నంత తేడా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

విహెచ్ ఎప్పుడూ ఇంతే. తలా తోక లేకుండా మాట్లాడుతుంటారు. సోనియా దయతోనే జగన్ సిఎం అయ్యాడని ఏ పద్దతిలో చెప్పాడో కానీ ఓ విషయం మాత్రం నిజమని ఒప్పుకోవాలి. జగన్ కాంగ్రెస్ లోనే ఉండుంటే ఈ పాటికి పార్టీలో ఏ స్ధాయిలో ఉండేవారో చెప్పటం మాత్రం కష్టం.

ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వని కారణంగానే జగన్ కాంగ్రెస్ ను వదిలేశారని అందరికీ తెలిసిందే. జగన్ కు సోనియా  అనుమతి నిరాకరణలో  విహెచ్ లాంటి చాలామంది తెలంగాణా నేతలున్నారు. అప్పుడు వాళ్ళు అడ్డుపడకపోతే జగన్ కాంగ్రెస్ నుండి వచ్చేవాడు కాదేమో ?

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన జగన్ పై చంద్రబాబునాయుడు తో కలిసి కాంగ్రెస్ కేసులు పెట్టింది. అందుకు కూడా సోనియానే కారణం. జగన్ ను జైలులో పెట్టుండకపోతే జగన్ లో కసి పెరిగుండేదే కాదేమో. ప్రత్యేక పార్టీ పెట్టుకుని ఉండేవారే కాదు. రాష్ట్ర విభజన జరగటం, తెలంగాణాలో కాంగ్రెస్ తో చంద్రబాబు కలవటం లాంటివన్నీ సోనియా చలవే. సోనియా, చంద్రబాబు కలిసి వేసిన ప్రతీ అడుగు జగన్ కు లాభించాయి. కాబట్టి ఈ పద్దతిలో జగన్ సిఎం అవటానికి సోనియా కారణం అయ్యుండొచ్చు.