వైసీపీ తక్షణ కర్తవ్యం, ప్రజలకు వాస్తవాలు చెప్పడమే.!

వైసీపీ అంటే అది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ కూడా. పార్టీ తరఫున కాకపోయినా, ప్రభుత్వం తరఫున అయినా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్న సందిగ్ధాన్ని వైసీపీ ప్రభుత్వం వున్న పళంగా తొలగించాల్సిందే. 2019 ఎన్నికలు జరిగి మూడేళ్ళపైనే అయిపోయింది. ఇంకో ఏడాదిన్నరలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఆ ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటే మాత్రం ముమ్మాటికీ ప్రజలకు నిజాలు చెప్పి తీరాలి రాజధాని విషయంలో.

అమరావతిని రాజధానిగా వైసీపీ ఒప్పుకోవడంలేదు. వైసీపీ ప్రభుత్వ పెద్దలూ అందుకు ఒప్పుకోవట్లేదు. అమరావతిని ఎడారిగా, స్మశానంగా, ముంపు ప్రాంతంగా అభివర్ణిస్తూ, దాన్ని కమ్మ రాజధానిగా పేర్కొంటున్నారు. కానీ, సుప్రీంకోర్టులో మాత్రం ప్రస్తుతానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తారు. వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటైనప్పుడు దాన్ని ‘కమ్మరావతి’ అని ఎలా అనగలుగుతారు.? ఎడారి, స్మశానం, ముంపు ప్రాంతమనే విమర్శలు ఎలా చేయగలుగుతారు.? సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే, ఏప్రిల్ నుంచి విశాఖలో రాజధాని కార్యకలాపాలని ఓ మంత్రి చెబుతారు. అదిగదిగో కర్నూలులో హైకోర్టుకు సుప్రీం మార్గం సుగమం చేస్తోందని ఇంకో వైసీపీ నేత చెబుతారు. కానీ, ఇవి ఎలా సాధ్యం.?

మూడు రాజధానులు మా నినాదం. దానికి, విపక్షాలు అడ్డు తగులుతున్నాయని అనడం వరకూ తప్పు లేదు. కానీ, మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వంలో వున్నవారు ఎంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారన్నదీ ముఖ్యమే కదా.? ఆ మూడింటిలో ఒకటైన అమరావతిలో గడచిన మూడున్నరేళ్ళలో వైసీపీ సర్కారు ఏం చేసింది చెప్పగలగాలి కదా.?