Amaravati Farmers: పాపం పెద్దాయన… ఇంకా ఎంతమంది ఉసురు తీసుకుంటుందీ అమరావతి..?

Amaravati Farmers: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించడానికి గల ప్రధాన కీలక కారణాలో అమరావతి ఒకటని అంటారు. అయితే.. ఏపీలో రెండోసారి టీడీపీ అధికారంలోకి వచ్చినా.. అమరావతి అడుగులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. ప్రతీ వర్షాకాలం పునాదుల్లోకి, ఆ ప్రాంతంలోకి వచ్చిన వరద నీరుని తోడటం, ఎండబెట్టడమే సరిపోతుందనే చర్చా వినిపిస్తోంది! ఈ నేపథ్యంలో ఓ దారుణం చోటు చేసుకుంది.. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అమరావతి అంటే అది కొన్ని బిల్డింగులు, గ్రాఫిక్స్ లు, చాలామంది నాయకులకు బంగారు గుడ్డు పెట్టే బాతు కాదు.. వేల మంది రైతుల గుండే చప్పుడు, వారి కుటుంబాల భవిష్యత్తు అని పెద్దలకు ఎప్పుడు అర్ధం అవుతుంది..?

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం వ్యూహాత్మకంగా, సెంటిమెంట్ పేరు చెప్పి కట్టిపడేసి, వారి జీవితాలను ఆగం చేస్తుందా..?

తాజాగా మంత్రి నారాయణ ముందే మరణించిన ఓ రైతు దీనగాథ ప్రభుత్వ పెద్దలకు వినిపించడం లేదా..? వారి మనసులు కరగడం లేదా..?

యువకుల జీవితాలను పణంగా పెట్టి, రైతుల కుటుంబాలతో ఆటలాడుకుంటూ, అద్భుతం అని చెప్పే ఈ కాంక్రీటు కట్టడాలు.. ఆ పెద్దాయన కుటుంబానికి ఏమని సమాధానం చెబుతాయి..?

అమరావతి విషయంలో, దాని వెనుక జరుగుతుందని చెబుతోన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో.. భూములిచ్చిన రైతులు, ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంలోని పౌరులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇప్పటికైనా గ్రహిస్తారా..?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ కొలువు దీరింది.. అలా కొలువై ఇప్పటికే సుమారు 18 నెలలు దాటేసింది! ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే.. టీడీపీని నమ్మి భూములు ఇచ్చిన రైతులు ఊపిరి పీల్చుకున్నారని అంటారు.. కానీ, సమస్యల పరిష్కారంలో ఎలాంటి ముందడుగు పడకుండా, పాడిందే పాడరా పాసిపళ్ల దాసన్న అన్న చందంగా పరిస్థితి మారిపోవడంతో.. ఇప్పుడు ఆ రైతుల ఊపిరి నాయకుల ముందు, తోటి రైతుల సమక్షంలో ఆగిపోతోంది!

ఈ క్రమంలో శుక్రవారం మున్సిప‌ల్‌ శాఖ మంత్రి కె.నారాయ‌ణ ఎదుట గోడు వినిపిస్తూ.. వినిపిస్తూ.. అమ‌రావ‌తి రైతు గుండె ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న కేవ‌లం అమ‌రావ‌తి రైతునే కాదు, రైతు అన్న ప్రతి ఒక్కరిలోనూ, రైతుతో సంబంధం ఉన్న ప్రతీ మనిషినీ గుండెను క‌దిలిస్తోంది. ఈ విషాదఘటన అమరావతి గ్రాఫిక్స్, తీపి కబుర్ల మాటున ఉన్న విషాదాన్ని చెప్పకనే చెబుతుంది!

వివరాళ్లోకి వెళ్తే… అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత‌మైన మందడంలో గ్రామ‌స‌భ చేప‌ట్టారు. ఈ స‌భ‌కు మంత్రి నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన బాధితుడు రామారావు త‌న గోడు వినిపించుకోడానికి మైక్ అందుకున్నారు.. ఎంతో ఆవేద‌న‌, ఆక్రోశంతో ఆయ‌న మాట‌లు మొద‌లు పెట్టారు. ఇల్లు తీసుకుంటానంటే తీసుకోండి.. సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వాల‌ని కోరామని గుర్తు చేశారు!

అమ‌రావ‌తి రాజ‌ధానికి త‌మ పొలాలు ఇచ్చిన‌ట్టు చెప్పిన ఆయన.. సింగ‌పూర్ వాళ్లకు ఇచ్చిన స్థలంలోంచి త‌మ‌కు రెండు ఎక‌రాలు వాగులో ప్లాట్లను సీఆర్‌డీఏ అధికారులు ఇచ్చిన‌ట్టు ఆవేద‌న వ్యక్తం చేశారు. వాగులో ఎందుకిచ్చార‌ని అధికారుల్ని ప్రశ్నించారు.. దీనికి ఆ అధికారులు చెప్పిన సమాధానం ‘మంత్రి నారాయ‌ణ ఆదేశాలు అన్నట్లు’ ఆయ‌న పేర్కొన్నారు. దీంతో.. లోతైన నీళ్లలో తమను మంత్రి నారాయణే ముంచాడంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఈ క్రమంలో ఎన్నో విషయాలను వెల్లడిస్తూ.. ప్రభుత్వాన్ని నమ్మి అన్నం పెట్టే భూములను రాజధానికి ఇచ్చిన త‌నలాంటి రైతుల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని వివ‌రిస్తూ.. ఒక్కసారిగా రైతు రామారావు కుప్పకూలారు. ఆస్పత్రికి త‌ర‌లిస్తుండ‌గా తుది శ్వాస విడిచారు. దీంతో.. ఇది నారాయణ సమక్షంలో ప్రభుత్వ చేసిన హ‌త్య అని ప‌లువురు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు!

ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు… ఇంకా స్థలాలు కావాలనే రియల్ ఎస్టేట్ ఆలోచనలు మానేసి, రైతులను, ప్రజలకు ఏమార్చాలనే ఆలోచనను విరమించి.. ఇప్పటికైనా అమారావతి గురించి భూములిచ్చిన రైతులకైనా వాస్తవాలు చెప్పాలని.. అమరావతిని పోలవరం ప్రాజెక్టు మాదిరిగా మార్చి, రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనను వదిలి.. వాస్తవంలో బ్రతకాలని, ప్రాక్టికల్ గా మాట్లాడాలని, పాలించాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు!

Journalist Bharadwaj Reveals Shocking Facts About Raja Saab Movie || Prabhas || Nidhhi Agerwal || TR