తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీతి అయోగ్ మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదొక శుద్ధ దండగ వ్యవహారమన్నారు. ప్రణాళికా సంఘాన్ని నాశనం చేసి, నీతి అయోగ్ పేరుతో కేంద్రంలోని మోడీ సర్కారు, దేశ ప్రజల్ని మోసం చేస్తోందంటూ కేసీయార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. బీజేపీకీ, తెలంగాణ రాష్ట్ర సమితికీ మధ్య జరుగుతున్న రాజకీయంలో, నీతి అయోగ్ మీద ఈ స్థాయి ఆరోపణలు రావడంలో వింతేమీ లేదు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ నీతి అయోగ్ పని చేస్తోంది. మోడీ హయాంలో ప్రణాళికా సంఘం అటకెక్కి, నీతి అయోగ్ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిదానికీ నీతి అయోగ్ సిఫార్సుల మేరకు.. అంటూ మోడీ సర్కారు తప్పించుకుంటోన్న వైనాన్ని దేశ ప్రజలంతా చూస్తున్నారు.
మిగతా వ్యవహారాల్ని పక్కన పెట్టి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రణాళికా సంఘం అటకెక్కింది.. నీతి అయోగ్, దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందంటూ పదే పదే బీజేపీ చెప్పడం చూస్తూనే వున్నాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులనీ, ఇంకోటనీ.. ఏవేవో కథల్ని బీజేపీ వినిపిస్తూనే వుంది.
ప్రత్యేక హోదా అనేది రాజకీయ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభించాలి. నిజానికి, రాజకీయ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం కూడా జరిగిపోయింది. కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇవ్వాలి కాదు, ఇచ్చేయబడింది.. దాన్ని అమలు చేయడమొక్కటే మిగిలి వుంది. ఇది దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కూడా.!
చట్ట సభల్లో.. అందునా పెద్దల సభలో, అధికార విపక్షాల మధ్య ఒప్పందం కుదిరిన మేరకు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంక్రమించింది. దాన్ని నరేంద్ర మోడీ సర్కారు తుంగలో తొక్కింది. మరి, నీతి అయోగ్ ఏం చేస్తోంది.? ప్రత్యేక హోదా విషయంలో హామీని విస్మరించామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేని నీతి అయోగ్ వుండి ఉపయోగమేంటి.? అన్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే, అది తప్పెలా వుంటుంది.?