జేసికి చంద్రబాబు షాక్..ఎంఎల్ఏల ఫిర్యాదే కారణమా ?

అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డికి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. సర్వేల్లో సరైన ఆశించిన ఫీడ్ బ్యాక్ రాకపోతే ఎంపిగా మళ్ళీ టిక్కెట్టిచ్చేది లేదని జేసి కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారట. ఈమధ్యే చంద్రబాబు రెండు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగానే ఎంఎల్ఏలు, ఎంపి పనితీరు మీద కూడా సమీక్ష చేశారు. తన సమీక్షలో భాగంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పనితీరు, ఎంఎల్ఏలపై జనాల అభిప్రాయాలను వినిపించారు. దాంతో ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైంది.

 

జిల్లాలోని కల్యాణదుర్గం, శింగనమల, కదిరి, పుట్టపర్తి, గుంతకల్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్దితి చాలా ఘోరంగా ఉందన్న విషయం చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకనే అందరికీ ఫుల్లుగా క్లాసు పీకారు. చంద్రబాబు పీకిన క్లాసును బట్టి చూస్తుంటే ఐదుగురు ఎంఎల్ఏలు హనుమంతరాయ చౌదరి, యామినీబాల, అత్తార్ చాంద్ భాష, పల్లె రఘునాధరెడ్డి, జితేందర్ గౌడ్ లకు టిక్కెట్లు దక్కేది అనుమానమే. అదే సమయంలో ఎంపి జేసి పనితీరు మీద  కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.

 

జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోను చంద్రబాబు సర్వే చేయించారు. అయితే, సమయం సరిపోలేదన్న కారణంతో పై ఐదు నియోజకవర్గాల ఫలితాలు మాత్రమే బయటపెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కీలక నేతలున్నారు. అందువల్ల కూడా వాటిని బహిర్గతం చేయలేదని కూడా టాక్ నడుస్తోంది. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత, హిందుపురంలో బావమరిది నందమూరి బాలకృష్ణ, పెనుకొండలో బికె పార్ధసారధి, ధర్మవరంలో వరదాపురం సూర్యనారాయయణరెడ్డి, రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి, మడకశిరలో ఈరన్న, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, హిందుపురం పార్లమెంటులో నిమ్మల కిష్టప్ప లాంటి సినియర్లున్నారు. వీరిలో అందరిమీద జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నది వాస్తవం.

 

 సర్వే వివరాలు జేసితో మాట్లాడుతూ, అందరినీ కలుపుకుని వెళ్ళకపోతే గెలుపు కష్టమని దివాకర్ కు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారట. కనీసం 10 మంది ఎంఎల్ఏలను మార్చకపోతే పార్టీ గెలుపు కష్టమని జేసి చెబుతున్నారు. అదే సమయంలో ఎంపిగా జేసికే టిక్కెట్టిస్తే గెలవడంటూ ఎంఎల్ఏలందరూ చంద్రబాబుకు ఈమధ్యనే ఫిర్యాదు చేశారు. దాంతో ఎవరి ఫిర్యాదులో నిజముందో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా ఎంపికి ఫుల్లు క్లాస్ పీకారట. తాను చేయించుకుంటున్న సర్వేల్లో సరైన ఫీడ్ బ్యాక్ రాకపోతే టిక్కెట్టు ఇచ్చేది  లేదని స్వయంగా జేసికే చంద్రబాబు స్పష్టం చేశారట. అంటే  జేసిని పక్కన పెట్టేందుకు చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.