భారత్ పేరు మార్పిడి అంతా పుకారేనా… ఇదిగో ప్రూఫ్?

ఇండియా పేరు భారత్ గా మారుస్తున్నారంటూ నిన్న మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచిన సంగతి తెలిసిందే. మీడియాలోనూ, పార్టీల మధ్య ఇదే వాదన నడిచింది. ఇదంతా కేవలం పుకార్లేనా.. ఇందులో నిజం లేదా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.

జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ లో విదేశీ అతిధులకు ఏర్పాటు చేసిన విందు ఆహ్వానపత్రికలో దేశంలో పెద్ద అలజడే రేపింది. “ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా” అని కాకుండా “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని ముద్రించడంతో అసలు రచ్చ ప్రారంభమైంది. అంత హఠాత్తుగా పేరు మార్చాల్సిన అవసరం ఏముందనే విమర్శలకు బలంగా వినిపించాయి.

అదే సమయంలో కేంద్ర మంత్రులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంతో ఆల్ మోస్ట్ కన్ ఫాం అని కూడా అన్నారు. ఇంకొంతమంది బీజేపీ నేతలైతే… భారత్ పేరు నచ్చనివాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో తాజాగా సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా… నూతన పార్లమెంట్ భవన అధికారిక ప్రకటన్లో భాగంగా కేంద్రం ఒక గెజిట్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా… “ది పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా” అని పేర్కొంది. దీంతో… ఇండియా అనే పేరే కంటిన్యూ అవుతున్నట్లుంది అనే చర్చ మొదలైంది!

అవును.. లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లా ఇవాళ (సెప్టెంబర్ 19న) అధికారికంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా”గా నోటిఫై చేశారు. ఈ మేరకు లోక్‌ సభ సెక్రటేరియట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ పేరు మార్చే ఉద్దేశ్యమే ఉంటే “పార్లమెంట్ హౌస్ ఆఫ్ భారత్” అనే గెజిట్ వెలువడేదనే వాదన వస్తోంది.