టీడీపీ శ్రేణుల్లో “ఇండియా టుడే” సర్వే టెన్షన్!

తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ “ఇంటియా టుడే”… “మూడ్ ఆఫ్ ది నేషన్” అంటూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై అంచనాలను ప్రకటించింది. సరే జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంపై జరుగుతున్న చర్చ సంగతి కాసేపు పక్కన పెడితే… ఏపీలో పరిస్థితిపై వెళ్లడించిన ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ చర్చే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో సరికొత్త టెన్షన్ కు కారణమవుతుందని అంటున్నారు పరిశీలకులు.

వివరాళ్లోకి వెళ్తే… తాజాగా “ఇండియా టుడే” సర్వే ఫలితాలను వెళ్లడించింది. ఈ ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ 45 శాతం ఓట్లతో 17 లోక్‌ సభ స్థానాలు వస్తాయని, వైసీపీ 41.1శాతం ఓట్లతో కేవలం 8 ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుంది. దీంతో… ఒక వర్గం మీడియా ఈ ఫలితాలపై కథనాలు మొదలుపెట్టింది.. భారీ స్థాయిలో ప్రచారానికి పూనుకుంది. ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారమే ఆలస్యం అనేస్థాయిలో వాయిస్తుంది!!

ఇంకా గట్టిగా చెప్పాలంటే… ముందుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేయాలా.. లేక, ముందు ఎన్నికలు పెట్టి, ఆ తర్వాత చేయమంటారా అన్న రేంజ్ లో ప్రచారం చేస్తుంది! ఇక చినబాబు లోకేష్ కూడా తాను అసెంబ్లీలోకి ఎంటరైపోయినట్లు.. స్పీకర్ కి కుడివైపున ముందువరుసలో కూర్చున్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు!! ఇందులో తప్పేముంది…? ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ మాత్రం సందడి ఉంటుంది కదా? అనుకుంటే పొరపాటే అని అంటున్నారు తమ్ముళ్లు!

అందుకు కారణం… ఆ సర్వే “ఇండియా టుడే” ది మాత్రమే కాదు సుమా… “ఇండియా టుడే – సీ ఓటర్” సర్వే అది! అంటే… మీడియా పాత్ర ఇండియా టుడేది అయితే… సర్వే నిర్వహణ బాధ్యతలు సీ ఓటర్ చేసి ఉంటుందన్నమాట! ఇప్పుడు తమ్ముళ్ల టెన్షన్ మొత్తానికి ఇదే కారణం! 2019లో కూడా సీ’ఓటర్ ఇలాంటి సర్వే చేశామంటూ ఫలితాలు వెల్లడించింది. దీంతో… ఇంకేముంది.. ప్రమాణ స్వీకారం అమరావతిలోనా, విశాఖలోనా అన్నస్థాయిలో కళలు గన్నారు.. తీరా అసలు ఫలిల్తాలు వచ్చేసరికి బోరుమన్నారు అనేది తమ్ముళ్ల ఆందోళనగా ఉంది.

2019 ఎన్నికల్లో టీడీపీకి 14 లోక్‌ సభ స్థానాలు వస్తాయని, 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని సీ’ఓటర్‌ అభిప్రాయపడింది. దీంతో.. అప్పట్లో ఈ ఫలితాలపై ఒక వర్గం మీడియా “ఇంకెంత… అధికారంలోకి వచ్చేసినట్లే… ఎన్నికలు జరగడం, ఫలితాలు వెళ్లడించడమే ఆలస్యం” అన్నట్లుగా హడావిడి చేసింది. తీరా “అసలు” ఫలితాలు వచ్చేసరికి… వైసీపీ 22 లోక్‌ సభ, 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ 3 లోక్‌ సభ, 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది.

ఆ సీ’ఓటర్ సర్వే ఫలితాల విషయం అక్కడితో ఆగిపోలేదు సుమా. 2023లో జరిగిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ ఎన్నికల్లోనూ చెప్పిన ఫలితాలకు.. అసలు ఫలిల్తాలకూ పొంతనలేకుండా పోయింది! ఇప్పుడు ఇదే టీడీపీ శ్రేణుల ఆందోళనకు కారణంగా ఉంది!! సీ’ఓటర్ చెప్పిందంటే సందేహించాల్సిందే అనే ఆందోళన నెలకొందని అంటున్నారు!!