ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా..ఎన్ని ప్రభుత్వాలు మారినా రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం రకం మాత్రం మారలేదు. 2020 లో కూడా దుడ్డు బియ్యం మింగాల్సిందే. తినలేక నానా అవస్థలు పడినా…రేషన్ డీలర్లు అక్రమంగా తరలింపులకు పాల్పడినా దాన్ని పట్టించుకునే నాధుడే లేడు. చివరికి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ దుస్థితి మారుతుందని ప్రజలు భావించారు. కానీ ఇప్పటికీ అదే పరిస్థితి. ప్రభుత్వం ఇస్తోన్న దుడ్డు బియ్యాన్నే ఏడాది నుంచి తినాల్సిన పరిస్థితి. ఆ మద్య ఈ విషయంలోనూ అధికార -ప్రతిపక్ష పార్టీల మధ్య నానా యాగీ జరిగింది.
సన్నబియ్యం ఇస్తామన్నారు ఎందుకివ్వలేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఎవడు ఇస్తామన్నాడని అధికార పక్షం ప్రతి దాడికి దిగింది. ఆ తర్వాత మ్యాటర్ కామ్ అప్ అయింది. తాజాగా ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో సంచలన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు ద్వారా బియ్యం కావలన్న వారికి బియ్యం…వద్దు అనుకున్న వారికి బియ్యం స్థానంలో నేరుగా నగదు బదిలీ చేయాలని ఆలోచన చేస్తున్నారుట. ఈ విధంగా చేయడం వల్ల కోర్టుల ద్వారా కూడా ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నారుట. నిజమే ప్రజలు బియ్యం కావాలనుకుంట బియ్యం…డబ్బు కావాలనుకుంటే డబ్బు తీసుకుంటే అంతా ప్రజల ఇష్ట ప్రకారం జరిగేది కాబట్టి న్యాయపరంగా కూడా ఇబ్బందుల తలెత్తవు.
గతంలో ఇలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు కూడా చేసారు. కానీ బియ్యం నగదు బదిలీ చేస్తే రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు నిలిపేయాల్సి వస్తుంది. తద్వారా ఆ రకం బియ్యం పండిచిన రైతు నష్టపోతాడని వెనకడుగు వేసారు. నగదు బదీలి ద్వారా జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకుని టీడీపీ అప్పట్లో వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ పథకాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఐడియాని జగన్ మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడం అన్నది ఆసక్తికరమే.