సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేస్ కేడర్ కు మారిన ఆమె కొన్నాళ్లు వెయిటింగ్ లో ఉన్నారు.
తాజాగా చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో ఆమెకు కీలకమైన మున్సిపల్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న J.శ్యామలరావును జలవనరుల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్రం తెలంగాణకు కేటాయించింది. వాస్తవానికి ఆమె స్వస్థలం విశాఖపట్నం. హైదరాబాద్ పోస్టల్ అడ్రస్ కారణంగా కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది. తెలంగాణ నుంచి ఏపీకి పంపేందుకు కేంద్రం నిరాకరించింది. ఐతే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(CAT)ను ఆశ్రయించిన ఆమె.. పోస్టల్ అడ్రస్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి రైల్వే జాబ్ కారణంగా.. తాము హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని.. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.