జగన్ నేరస్ధుడని చంద్రబాబు ఎలా డిసైడ్ చేస్తారు ?

ఒకవైపు కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. మరోవైపు అభియోగాలపై తగిన ఆధారాలు లేవని ఒక్కొక్కరిపై కేసులు కొట్టేస్తున్నాయి కోర్టులు. కేసుల విచారణ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డిని నేరస్ధునిగా చంద్రబాబునాయుడు తీర్పిచ్చేశారు. నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ సినీ ప్రముఖులు ఓ నేరస్ధునితో కలుస్తున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు. నేరస్ధునితో సినీ ప్రముఖులు భేటీ అవ్వటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. నేరస్ధునితో సినీ ప్రముఖులు భేటీలు అవటం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు ఆక్షేపించారు.

నిజమే చంద్రబాబు చెప్పిన దాంట్లో తప్పేమీలేదు. నేరస్ధులతో ఎవరు  భేటీ అయినా తప్పు పట్టాల్సిందే. కానీ విచిత్రమేమిటంటే జగన్ ను చంద్రబాబు నేరస్ధునిగా ముద్రవేసేయటం. జగన్ నేరగాడని ఏ కోర్టు కూడా ఇంత వరకూ తీర్పు చెప్పలేదు. కేసులు విచారణలో ఉన్నంత వరకూ ఎవరైనా నిందితుడే కానీ నేరగాడు కాదు. ఇంతచిన్న విషయం చంద్రబాబుకు తెలీకపోవటం దురదృష్టం. పైగా జగన్ పై పెట్టిన కేసుల్లో ఒక్కోటి కోర్టుల్లో వీగిపోతున్నాయి. రేపో మాపో మిగిలిన కేసులను కూడా కోర్టు కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సినీప్రముఖులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు, టిడిపి ప్రజా ప్రతినిధులు అందరూ వరసబెట్టి జగన్ ఇంటికి వెళ్ళి మరీ కలుస్తున్నారు. వారిలో టిడిపి వాళ్ళైతే పార్టీకి రాజీనామాలు చేసి వైసిపిలో చేరిపోతున్నారు. దాంతో చంద్రబాబులో ఉక్రోషం తారాస్ధాయికి చేరుకుంటోంది. అందుకనే జగన్ ను నేరస్ధుడని తన అక్కసంతా తీర్చుకుంటున్నారు.

కోర్టులో కేసులున్నంత మాత్రానా నేరస్ధులైపోతే చంద్రబాబు కూడా నేరస్ధుడే. చంద్రబాబు మీదకూడా చాలా కేసులు కోర్టుల్లో స్టేల రూపంలో కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు ? ఓటుకునోటు కేసు విచారణ జరక్కుండా చంద్రబాబు స్టే తెచ్చుకోలేదా ? విచారణ జరిగుంటే చంద్రబాబు కథేంటో ఈపాటికి తేలిపోయేదే కదా ? విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారణ జరపకుండా ప్రయత్నం చేయలేదా ?

చంద్రబాబు సంగతి పక్కనపెట్టినా మొన్నటి వరకూ కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి మాటేంటి ? రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంఎల్ఏ బొల్లినేని రామారావు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపి రాయపాటి సాంబశివరావు తదితరులపై కేసులు లేవా ? చంద్రబాబు సూత్రం ప్రకారం టిడిపిలో కూడా చాలామంది నేరస్ధులున్నట్లే కదా ? నేరస్ధులను వెనకేసుకొస్తున్న చంద్రబాబు మాత్రం నేరగాడు కాకుండా పోతారా ? జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నపుడే చంద్రబాబు కడుపుమంట తెలిసిపోతోంది.