జగన్ నిర్ణయానికి హై కోర్టు షాక్

విద్యుత్ పిపిఏల సమీక్షలపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి హై కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబునాయుడు హయాంలో అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి సంస్ధలు చేసుకున్న ఒప్పందాలను జగన్ ప్రభుత్వం సమీక్షించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే  చర్చలకు రావాలంటూ 40 కంపెనీలకు ప్రభుత్వం నుండి నోటీసులు అందాయి.

అయితే పిపిఏల సమీక్షలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని సవాలు చేస్తు చాలా కంపెనీలు కోర్టుకెక్కాయి. దాంతో సమీక్షలను, చర్చలు జరపటాన్ని నాలుగు వారాలు వాయిదా వేయాలంటూ హై కోర్టు ఆదేశించింది. జగన్ నిర్ణయంపై కంపెనీలు కోర్టుకు వెళతాయని అందరూ ఊహించిందే.

అయితే ప్రజలకు భారంగా జరిగిన పిపిఏలను సమీక్షించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదు. విద్యుత్ పిపిఏల్లో సుమారు రూ 3 వేల కోట్లు అవినీతి జరిగిందని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు. నిపుణుల కమిటి సమీక్షలు పూర్తిచేసి ఫైనల్ రిపోర్టు ఇస్తేనే కానీ మొత్తం అవినీతి ఎంతో తెలీదన్నారు జగన్.

అయితే నిపుణుల కమిటి ఎంతగా విచారణలు జరిపినా, అధ్యయనం చేసినా సమీక్షలు చేయటాన్ని, చర్చలు జరపటాన్ని కోర్టు అడ్డుకోవటంతో ఎవరూ ఏమీ చేయగలిగేది ఏమీ లేదని తేలిపోతోంది. విషయం ఎప్పుడైతే కోర్టు మెట్లెక్కిందో ఇదంత తేలిగ్గా పరిష్కారమయ్యే సమస్య కాదని అర్ధమైపోతోంది.