ప్రపంచవ్యాప్తంగా మనుషుల ప్రాణాలకు అతిపెద్ద ముప్పుగా మారుతున్నది గుండె సంబంధిత వ్యాధులే. ఒక్కసారిగా కూలిపోవడమే గుండెపోటు అనుకునే మనస్తత్వం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. కానీ వైద్య నిపుణుల మాట ప్రకారం.. హార్ట్ అటాక్ ఒక్కసారిగా వచ్చేది కాదు. అది రావడానికి ముందే శరీరం అనేక సంకేతాలను ఇస్తుంది. వాటిని గుర్తించకపోవడమే ప్రాణాంతకంగా మారుతోంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు చెబుతున్నదేమిటంటే.. 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.79 కోట్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మరణించారు. వీరిలో మెజారిటీ మరణాలకు కారణం గుండెపోటు, హార్ట్ స్ట్రోక్‌లే. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ మరణాల్లో చాలా వాటిని ముందస్తుగా నివారించే అవకాశం ఉన్నప్పటికీ, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేజారిపోయిందని వైద్యులు చెబుతున్నారు.
గుండెపోటుకు ముందు కనిపించే ప్రధాన సంకేతాల్లో ఛాతీలో అసౌకర్యం ఒకటి. తీవ్రమైన నొప్పి కాకపోయినా, ఛాతిపై ఎవరో బరువు పెట్టినట్టుగా అనిపించడం, ఒత్తిడి, బిగుతు, మండుతున్న భావన కనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ అసౌకర్యం చేతులు, మెడ, దవడ, వీపు వరకు వ్యాపిస్తుంది. ఇవన్నీ కొన్ని రోజులు లేదా వారాల ముందే మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకో ముఖ్యమైన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. సాధారణంగా చేసే పనులు చేస్తున్నప్పుడు లేదా పూర్తిగా విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఊపిరి సరిగా ఆడకపోవడం గుండె నుంచి వచ్చే హెచ్చరికగా భావించాలి. గుండె రక్తాన్ని సమర్థంగా పంప్ చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ లక్షణం గుండెపోటుకు కొన్ని వారాల ముందే మొదలవుతుండటం ప్రమాదకరం.
చాలామంది పెద్దగా పట్టించుకోని మరో సంకేతం నిద్రలేమి. రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా చెమటలు పట్టడం, ఊపిరి తీసుకోవడానికి లేచిపోవడం వంటి లక్షణాలు గుండె ఆరోగ్యం బాగోలేదన్న సూచనలుగా భావించాలి. ఇవి దీర్ఘకాలంగా కొనసాగితే గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తొందరగా అలసిపోవడం కూడా గుండెపోటుకు ముందు కనిపించే కీలక సంకేతం. రోజూ చేసే పనులే అకస్మాత్తుగా భారంగా అనిపించడం, మెట్లు ఎక్కినా శక్తి లేనట్టు అనిపించడం, సాధారణ నడకతోనే అలుపు రావడం వంటి మార్పులు శరీరం ఇస్తున్న హెచ్చరికలు కావొచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
అలాగే గుండె వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం, దడగా అనిపించడం, తలతిరగడం, మూర్ఛకు దగ్గరగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఇక ఆలస్యం చేయకూడదు. ఇవన్నీ కలిసి కనిపిస్తే అది రాబోయే గుండెపోటుకు ముందు వచ్చే అత్యంత ప్రమాదకర హెచ్చరికగా వైద్యులు పేర్కొంటున్నారు.
