నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్… 11.25 గంటలకు నరసరావుపేట మున్సిపల్ స్టేడియం చేరుకుని వివిధ స్టాల్స్ పరిశీలించిన అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఇక విజయవాడ దుర్గ గుడిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ… దేవాదాయ శాఖ ఆదేశాలతో ప్రత్యేకంగా దుర్గగుడిలో గోపూజ కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు. దుర్గ గుడిలో ప్రతి రోజూ గోపూజ జరుగుతుంది. భక్తులు పాల్గొనవచ్చు అని ఆయన సూచించారు. గోశాల నిర్వహణ కు భక్తులు విరాళాలు సమర్పించవచ్చు అని ఆయన ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు దుర్గగుడిలో చతుర్వేద హోమం నిర్వహిస్తాం అన్నారు.
ఈ హోమానికి వేదపండితులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని భక్తులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాం అన్నారు. పలువురు పీఠాధిపతులు హోమంలో పాల్గొనేందుకు వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. గోసంరక్షణ,వేద పాఠశాల ట్రస్టులను దేవస్థానం నిర్వహిస్తోంది అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో దుర్గ గుడిలో అభివృద్ది పనులు ప్రారంభించాం అని అన్నారు. శివాలయం పునర్నిర్మాణం, ప్రాకారం, అన్నదానం భవనం, ప్రసాదం పోటు నిర్మిస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో పనులు పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్ తో ప్రారంభోత్సవాలు చేయిస్తాం అని వెల్లడించారు.