పవన్ కళ్యాణ్ అనే పేరును చంద్రబాబు నాయుడు ఇకపై మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆ పేరును జపించడం వల్లనో శపించడం వల్లనో చంద్రబాబు నాయుడుగారికి ఒరిగేదేమీ ఉండదు. ఇన్నాళ్లు జనసేన మీద ప్రతిపక్షం కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తూ వచ్చింది. కారణం వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తారేమోనని చిన్న ఆశ. ఆ వైపుగా చాలా ప్రయత్నాలే సాగాయి. కానీ పవన్ పట్టించుకోలేదు. రాయబారులు పొత్తు విషయం ఎత్తితే వద్దనే వద్దన్నారు. ఒకటిన్నర సంవత్సరంగా పవన్‌ను ప్రసన్నం చేసుకోవాలని టీడీపీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. పవన్ కలిసొస్తే కాపు వర్గం ఓట్లు దండుకోవచ్చని వేసుకున్న అంచనాలన్నీ నీరుగారాయి. ఇకపై ఆయన్ను పొగడటం, అనుసరించడం కూడ వేస్ట్.
అలాగని ఆయన మీద రివర్స్ గేర్లో వెళ్లినా ఉపయోగం ఉండదు. రివర్స్ గేర్ అంటే పొగిడితే పడలేదు కాబట్టి తిట్టేసి కూల్చేయడం అన్నమాట. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సిద్ధాంతం చంద్రబాబుది. అందుకే పవన్ లొంగలేదు కాబట్టి కూల్చి పగతీర్చుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. ఇప్పటికే ఎల్లో మీడియా ఆ పని స్టార్ట్ చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనిది ఆయన మీద అసంతృప్తి వ్యక్తమవుతోంది ఎల్లో మాధ్యమాల్లో. అయితే ఈ ప్రయత్నం వలన కూడ ఫలితం ఉండదు. ఎందుకంటే విమర్శించడానికి పవన్ దగ్గర పవర్ లేదు కాబట్టి. అధికార పక్షమైతే పాలన చేస్తుంది కాబట్టి తప్పు చేసే అవకాశం ఉంటుంది వాటిని ఎత్తి చూపువచ్చు. ప్రతిపక్షమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కాబట్టి పనిచేయలేదని వేలెత్తి చూపొచ్చు.
కానీ పవన్ దగ్గర ఏమీ లేవు. ఆయన మీద అవినీతి మరకలు లేవు. పాలనలో భాగస్వామ్యం ఆయనకు లేదు. కనీసం అసెంబ్లీలో జనసేన పార్టీకి ప్రాతినిథ్యమే లేదు. ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే కూడ వైసిపీ గూటికే ఎగిరిపోయారు. కాబట్టి పవన్ అలా చేయలేదు, ఇలా చేశాడు అంటూ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తే లేని గోడ మీద బురద చల్లడమే. ఎలాంటి ఉపయోగమూ ఉండదు. పైగా కక్ష సాధింపు అని జనాలకు అర్థమైపోతుంది. కనుక చంద్రబాబు ఇకనైనా వంచడానికో, కూల్చడానికో పవన్‌ను ఫాలో అవ్వడం మానేసి ఆ సమయాన్ని ఇంకేదైనా పనికి కేటాయించుకుంటే ఫలితంగా దక్కుతుంది.