చివరి వన్డేలో టిమిండియా టార్గెట్ 273 పరుగులు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ గెలవాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 50 ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. ఓపెనర్ ఖవాజా (100) సెంచరీ, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (52) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిడిలార్డర్ విఫలమవడంతో ఆసీస్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, జడేజా, షమి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఫించ్, ఖవాజా ఆసీస్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు ఇద్దరూ కలిసి 76 పరుగులు జోడించారు. ఆ తర్వాత హ్యాండ్స్‌కాంబ్‌తో కలిసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించాడు ఖవాజా. ఈ దశలో ఆసీస్ మరోసారి భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది. అయితే నాలుగో వన్డే హీరో టర్నర్ (20)తో సహా మిగతా మిడిలార్డర్ అంతా విఫలమవడంతో ఆసీస్ 272 పరుగులకే పరిమితమైంది.