టీడీపీ ముందస్తు వ్యూహానికి వైఎస్ జగన్ చిక్కుతారా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అప్పుడే.. యాక్షన్ ప్లాన్ షురూ చేసేస్తోంది.

ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లోనే జరుగుతాయా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఆలోచన చేస్తారా.? లేదా.?

అదిగదిగో ముందస్తు ఎన్నికలు.. అంటూ తెలుగుదేశం పార్టీ నానా హంగామా చేస్తోంది. ఆయా సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల్నీ ఖరారు చేసే పనిలో బిజీగా వుంది టీడీపీ. జనసేన పార్టీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు వ్యూహ రచన షురూ చేసింది.

విపక్షాలు సిద్ధంగా లేవు గనుక, ఇప్పుడే ముందస్తుపై కీలక నిర్ణయం తీసుకుంటే, విపక్షాలు తేరుకునేలోపు పెద్ద షాక్ ఇవ్వొచ్చన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, అది ఆషామాషీ వ్యవహారం కాదు.. రిస్క్‌తో కూడుకున్నది.

‘మేం ముందస్తుకు వెళ్ళబోం.. ఆ ఆలోచనే మాకు లేదు..’ అంటూ వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తాజాగా ముందస్తు ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. అయితే, ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే విజయం’ అని అంటున్నారాయన.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి..’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం గమనార్హం. అయినా, నిర్ణయం తీసుకోవాల్సింది వైఎస్ జగన్. ఆయన మనసులో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు.