చంద్రబాబు చెప్పే మాటలు జగన్, పవన్ కు వర్తించవా ?

‘ కాంగ్రెస్ తో కలిసి పనిచేయటాన్ని కొందరు మహాపాపంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తామని, సహకరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రానికి న్యాయం చేస్తామన్న వారితో కలిసి పనిచేస్తే తప్పేంటి ?’ …ఇది తాజాగా చంద్రబాబునాయుడు వేసిన ప్రశ్న. చంద్రబాబు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. మరి అదే మాట వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికో లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు వర్తిస్తుందా ? ఇక్కడే సమస్య వస్తోంది చంద్రబాబుతో. ఏ పార్టీతో అయినా, ఏ అవసరం కోసమైనా తాను మాత్రమే పొత్తులు పెట్టుకోవాలి. ఇతరులు మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలి..ఓడిపోవాలి. ఇది చంద్రబాబు కోరిక.

అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాట వాస్తవమే. ఏపికి కాంగ్రెస్ ప్రత్యేకహోదా ఎప్పుడు ఇవ్వగలుగుతుంది ? కేంద్రంలో అధికారంలోకి వచ్చినపుడే కదా ? 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందా ? ఇప్పటికైతే ఎవరికీ నమ్మకం లేదు. క్షేత్రస్ధాయిలోని పరిణామాలు గమనిస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని అనిపిస్తోంది. కాకపోతే బిజెపికి సీట్లు తగ్గవచ్చంతే. నరేంద్రమోడి ఇపుడున్నంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. కాకపోతే తన వ్యక్తిగత ప్రయోజనాలు సాగలేదన్న కోపంతోనే నరేంద్రమోడిని వ్యతిరేకిస్తున్నారు.

ఇక, 24 గంటలూ చంద్రబాబు వైసిపిని బిజెపితోను లేకపోతే ఇంకో పార్టీతోనో ముడేసి ఆరోపిస్తుంటారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు. అదే జగన్ కు పొత్తులు పెట్టుకునే ఆలోచన లేకపోయినా బిజెపితో ముడేసి తూర్పారపట్టారు. మొన్నటి వరకూ వైసిపి కాంగ్రెస్ తో కలిసిపోతుందని ఇదే చంద్రబాబు అండ్ కో ఊరు వాడా ఎక్కి తెగ అరిచారు. చివరకు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంది చంద్రబాబే.

 

చంద్రబాబు వైఖరి ఎలా వుందంటే తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది. తన స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా రాష్ట్ర ప్రయోజనాలనే చెబుతారు. అదే జగన్ విషయంలో మాత్రం రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నట్లు మండిపోతుంటారు. ఇలా చెప్పే తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమి అంటూ జనాల ముందుకెళ్ళారు.  చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తని జనాలు మాడు పగలగొట్టారు. అది చాలదన్నట్లు మళ్ళీ ఏపిలో కూడా కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతున్నారు. మరి ఏపి జనాలు ఏం చేస్తారో చూడాలి.