Sachivalayam Employees: సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం టార్గెట్ చేసిందా..?

Sachivalayam Employees

ఏపీలో సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం టార్గెట్ చేసిందా..? వివిధ పనులు అప్పగిస్తూ పొమ్మనలేక పొగ పెడుతుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం సంస్థ అయిన ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రవేశపరీక్షలు ప్రవేశపెట్టి ఉద్యోగులను ఎంపిక చేసింది. గ్రామాలు, పట్టణాల, నగరాల్లోని వార్డుల్లో సచివాలయాలు ఏర్పాటుచేసింది. ఇందులో ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉద్యోగులుగా నియమించింది. సచివాలయం వ్యవస్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది.

గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా కోసం 2019 అక్టోబర్‌ రెండున గాంధీ జయంతి సందర్భంగా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. ఒక్కో గ్రామ సచివాలయంలో 11 నుంచి 14 మంది ఉద్యోగులను నియమించారు. దీంతో మండల, జిల్లా కేంద్రాల్లో లభించే సేవలను సచివాలయాల్లో అందించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవినీతి, ఆర్థిక దుర్వినియోగానికి తావులేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలను అందిస్తూ జవాబుదారీతనం కల్పించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం పొందాలన్నా ప్రజలు తమకు దగ్గర్లోని సచివాలయాల ద్వారా పొందేవారు. క్యాస్ట్, ఇన్‌కమ్, బర్త్, మరణ ధృవీకరణపత్రాలతో పాటు ఇతర పత్రాలు ఏవి కావాలన్నా సచివాలయాల ద్వారా సులువుగా అందుకునేవారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు సేవలు అందించే అవకాశం లభించింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరి వలంటీర్ల వ్యవస్థతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు విస్తృత సేవలు అందించారు.

అయితే రాష్ట్రంలో అధికార మార్పిడితో సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవస్థను వైసీపీ హయాంలో తీసుకురావడంతో కూటమి ప్రభుత్వం తమ అక్కసు వెళ్లగక్కుతుందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుందని అంటున్నారు. గతంలో ఉన్న వలంటీర్ల బాధ్యతలను కూడా సచివాలయ ఉద్యోగులకు అప్పగించి పనిభారాన్ని మరింత పెంచిందని పేర్కొంటున్నారు. ఇప్పటికే అనేక సేవలు అందిస్తుండగా ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మూడు లేదా నాలుగు క్లస్టర్లను ఒక్కో ఉద్యోగికి అప్పగించారు.

వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలపై అవగాహన కల్పించాలని లేదా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు భయపెడుతున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై పక్షపాత వైఖరి అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదంటూ తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ–4 పథకం బాధ్యతలు తమ నెత్తిన పెట్టారని చెబుతున్నారు. ఓవైపు బదిలీలు, మరోవైపు విపరీతమైన పనిభారం వల్ల మానసిక వేదనకు గురవుతున్నామన్నారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను తీసివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తమను కూడా పక్కనపెట్టాలని చూస్తుందనే భయాందోళనకు గురవుతున్నారు. పనిభారం పెంచి తమను మానసికంగా వేధించి తమంతటా తామే ఉద్యోగాల నుంచి వెళ్లిపోయేలా ప్రయత్నాలు జరగుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పెట్టిన ప్రవేశపరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన తమను ఇలా వేధించడం సరికాదని.. ఇలాగే కఠినంగా వ్యవహరిస్తే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.