కేసీఆర్ పాలిటిక్స్: విశాఖ ఉక్కు విషయంలో… తగ్గేదేలే!

ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన ఎత్తుకున్న నినాదం.. ఆత్మగౌరవం అని. ఆ విషయంలో పరిపూర్ణంగా సక్సెస్ అయిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రికూడా అయిపోయారు. ఉద్యమం ఫలితం సక్సెస్ ఫుల్ గా పొందగలిగారు. అయితే ఇప్పుడు టీఆరెస్స్ నుంచి బీఆరెస్స్ గా మారిన అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన ఆయన… మాహారాష్ట్ర, కర్నాటక లతోపాటు ఆంధ్రప్రదేశ్ పై దృష్టిసారించారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ కి ఏపీ బీఆరెస్స్ బాధ్యతలు అప్పగించిన ఆయన… తాజాగా “ఆంధ్రుల హక్కు” పై దృష్టి సారించారు.

అవును… ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని మోడీసర్కార్ ఉత్సుకత చూపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడంలో ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపించే మోడీ & కో… ఇప్పుడు విశాఖ ఉక్కుని అమ్మేసుకోవాలని ఫిక్సయ్యారు. ఈ విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించలేని పరిస్థితి. లోకల్ ప్రెస్ మీట్ లు, లేఖలు రాయడాలు మినహా… పక్కాగా, ప్రణాళికా బద్ధంగా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడింది లేదు. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఉన్న స్నేహాలో, భయాలో… కారణం ఏదైనా.. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా… ఏపీలో అన్ని పార్టీలూ మౌనాన్నే తమ బాషగా చేసుకుని అచేతనంగా చూస్తూ కూర్చున్నాయి.

ఈ సమయంలో ఏపీలో బలంగా అడుగుపెట్టాలని ఫిక్సయిన కేసీఆర్… విశాఖ ఉక్కుపై కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ విషయంలో కేటీఆర్… ట్విట్టర్ ద్వారా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేయడంతోపాటు.. తాజాగా ప్రధానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్… అవసరమైతే తెలంగాణలోని సింగరేణి ద్వారా బిడ్డింగుకు పాల్పడి… స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అంటే… తెలుగు వారి ఆస్తిని తెలుగువారికే ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్నమాట!

ఒకరకంగా… ఇది సరైన సమయంలో కేసీఆర్ తీసుకున్న సరైన రాజకీయ నిర్ణయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అటు ఏపీలో రాజకీయంగా ఎంటరవ్వడానికి బీఆరెస్స్ కు ఎంతగానో మేలుచేసేదిగా చెబుతున్న ఈ అంశం… కేవలం పోరాటాలకు, ప్రెస్ మీట్ లకు మాత్రమే పరిమితం కాకుండా… బిడ్డింగ్ వేసి దక్కించుకోవాలనే ఆలోచన చేయడం గొప్ప విషయమనే భావన వ్యక్తమవుతుంది.

సెంటిమెంట్ పాలిటిక్స్ చేయడంలో పి.హెచ్.డి. చేశారనే పేరు సంపాదించుకున్న కేసీఆర్… తాజాగా తెలుగువారి ఎమోషనల్ అంశం… విశాఖ ఉక్కుపై కాన్సంట్రేషన్ చేయడం కచ్చితంగా సక్సెస్ ఫుల్ నిర్ణయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ ఈ విషయంలో ఏస్థాయివరకూ వెళ్తారు.. ఎంత దూరం వెళ్తారు.. అనేది వేచి చూడాలి. ఎందుకంటే… ప్రభుత్వ ఆసులను అంబానీ – అదానీలకు మాత్రమే కట్టబెట్టేలా మోడీ మనసుపెట్టి ఆలోచిస్తారనే విమర్శ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంటుంది. సో… ఈ విషయంలో వారందరినీ కాదని.. సింగరేణి సంస్థతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని గనుక కేసీఆర్ దక్కించుకుంటే… అది కచ్చితంగా ఒక చారిత్రక అంశమే! ఏది ఎమైనా… మోడీ వర్సెస్ కేసీఆర్ గా గత కొంతకాలంగా సాగుతున్న పొలిటికల్ వార్… అటు తిరిగి, ఇటు తిరిగి విశాఖ ఉక్కు ను చేరడం ఆసక్తికర పరిణామమే!