నేడు తిరుపతికి సీఎం జగన్.. మాజీ సైనికులకు సన్మానం !

cm jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించనున్నారు. పోలీస్ గ్రౌండ్స్ జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని మాజీ సైనికులను ఆయన సన్మానిస్తారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనను నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

YS Jagan ultimatum to ministers 
YS Jagan  

గురువారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ తిరుపతికి బయలుదేరుతారు. సాయంత్రం 4.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.50 నిమిషాలకు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. అనంరతం తిరుపతిలో చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి 7.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయలుదేరి వెళ్తారు.

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సైనికులను సన్మానించే కార్యక్రమాన్నికేంద్రం తలపెట్టింది. స్వర్ణిమ్ విజయ్ మాషల్ పేరుతో గత ఏడాది డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ కాగడాను వెలిగించారు. ఆ కాగడాను భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అది దక్షిణాది రాష్ట్రాల్లోకి తొలిసారిగా అడుగుపెడుతోంది.