మాకొద్దు బాబోయ్ పదో తరగతి పరీక్షలు..’ అంటూ విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. ప్రధాన మంత్రికీ, సినీ నటుడు సోనూ సూద్ తదితరులకీ ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోటెత్తుతున్నాయి ఆంధ్రపదేశ్ పదో తరగతి విద్యార్థుల నుంచి. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయి. సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దయిన విషయం విదితమే. తాజాగా ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశారు. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనే పదో తరగతి పరీక్షల విషయమై ప్రభుత్వం నుంచి మొండి పట్టుదల కనిపిస్తోంది. అసలు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వెళ్ళే పరిస్థితుల్లేవు. నిజానికి, చాలా రాష్ట్రాల్లో స్కూళ్ళు కొద్ది వారాల క్రితమే మూతపడ్డాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచిందని అనుకోవాలేమో. నిజానికి, చిన్న పిల్లల విషయంలో అస్సలు రిస్క్ చేయకూడదు ఏ ప్రభుత్వమైనా. ఇప్పటిదాకా విద్యార్థులకు స్కూళ్ళను కొనసాగించడమే పెద్ద తప్పిదంగా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూళ్ళను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, పదో తరగతి పరీక్షల్ని మాత్రం నిర్వహించి తీరతామంటోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బాధితులకు సరైన వైద్య చికిత్స అందని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సంపూర్ణ లాక్ డౌన్ తప్పదన్న చర్చ సర్వత్రా జరుగుతున్నా, కనీసం పదో తరగతి పరీక్షల విషయంలో కూడా విద్యార్థులపై ‘జాలి’ని ప్రభుత్వం చూపలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి మనసులో ఆలోచన ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. విద్యార్థులు మాత్రం, పరీక్షలకు ప్రిపేర్ కాలేక.. చదవుకుండా వుండలేక.. మానసిక క్షోభని అనుభవిస్తున్నారు. చూస్తోంటే, కరోనా నేపథ్యంలో విద్యార్థులు రోడ్డెక్కి మరీ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయాలేమో.. అన్నట్టు తయారైంది పరిస్థితి.