హాట్ న్యూస్: ప్రత్తిపాడు వైసిపి అభ్యర్థిపై క్లారిటీ

అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి మరి అభ్యర్థులను ప్రకటించినట్టు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగనున్న వైసిపి అభ్యర్థిపై క్లారిటీ వాచినట్టు తెలుస్తోంది.

వైసిపి ప్రధాన కార్యదర్శి, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న రాఘవేంద్ర రెసిడెన్సీలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ఆయన సమావేశమయ్యారు.

ఈ భేటీలో మాట్లాడుతూ నియోజకవర్గ ఇంచార్జి గా ఉన్న పర్వత పూర్ణ చంద్రప్రసాద్ నియోజకవర్గంలో పార్టీని బలపరచేందుకు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ఆయన నాయకత్వంలో ప్రత్తిపాడు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్తిపాడులో వైసిపి ని గెలిపించేందుకు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. నవరత్నాల పధకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు.

ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండొచ్చు అని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు వైసిపి ఇంచార్జి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, బీవీఆర్ చౌదరి, కుమార్ రాజా, అలమండ చలమయ్య స్థానిక నాయకులు హాజరయ్యారు. మీటింగ్ పూర్తయ్యాక వైసిపి నియోజకవర్గం తరపున వైవి సుబ్బారెడ్డిని శాలువా కప్పి సత్యదేవుని పటం అందించి సన్మానించారు.

ఇదిలా ఉండగా పర్వత పూర్ణచంద్రప్రసాద్ కి టికెట్ ఖాయమైనట్టు ప్రచారం జరగడంతో ఈ కార్యక్రమానికి టికెట్ ఆశిస్తున్న మురళి కృష్ణంరాజు, ఆయన వర్గీయులు హాజరు కాలేదు. ఈ విషయం సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. నాలుగు మండలాల నుంచి నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరైనా మురళి కృష్ణంరాజు రాకపోవడం హాట్ టాపిక్ ఐంది.

ఆయన వర్గానికి చెందిన అనుచరులు కేవలం 10 మంది మాత్రమే వచ్చారు. అది కూడా సమావేశంలో జరిగే విషయాలను ఆయనకు చేరవేసేందుకు అని గుసగుసలు వచ్చాయి. అంతే కాదు పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశం అయింది.

నియోజకవర్గంలో సర్వేలు చేయించి పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, పార్టీని బలపరుస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకులకే జగన్ టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. గెలుపు ఓటములు బేరీజు వేసుకునే అభ్యర్థులను కేటాయిస్తున్నారు జగన్. దీనికోసం అభ్యర్థులను మార్చటానికి, కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడానికి ఆయన వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గాలపైన ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు భంగపాటు కలుగుతోంది.

ఇప్పటికే వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ మరి కొందరు నాయకులు అసంతృప్తికి లోనయ్యారు కూడా. కానీ పార్టీ పెద్దలు పార్టీని గెలిపించుకోవడం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జగన్ కూడా సదరు నాయకులతో పర్సనల్ గా మాట్లాడి వివాదాలను సర్దుమణిచే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇప్పుడు ప్రత్తిపాడులో భంగపాటుకు గురైన వైసిపి నేతలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని గోదావరి జిల్లాలో హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి.