రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమో, గుర్రం ఎగరావచ్చు.! విజయసాయిరెడ్డి.. చంద్రబాబు వైపుకు తిగరావచ్చు.! ఈ చర్చ రాజకీయాల్లో జరగడానికి బలమైన కారణమూ లేకపోలేదు. ఇటీవల చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిశారు. నందమూరి తారకరత్న వ్యవహారంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలవక తప్పలేదు.
అప్పటిదాకా రాజకీయంగా తిట్టుకున్న వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు రాజకీయ ప్రముఖులు, బంధుత్వం దగ్గరకొచ్చేసరికి.. ఆ రాజకీయ గొడవలు మర్చిపోయి కలిసిపోయారు. చంద్రబాబుకి వున్న బొల్లి వ్యాధి గురించి తీవ్రమైన విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి, ఆ పాత వ్యవహారాలు మర్చిపోక తప్పలేదు.
ఓ ముప్ఫయ్ మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు పంపాలంటే ఎంత ఖర్చవుతుంది.? అన్న దిశగా చంద్రబాబు, విజయసాయిరెడ్డితో మాట్లాడారనీ, ఓ పెద్ద డీల్ గురించి కూడా ప్రాథమిక చర్చలు జరిపారనే ప్రచారమొకటి తెరపైకొచ్చింది. ‘శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా.?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజనం ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ఇద్దర్నీ.
గతంలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు.. అప్పట్లో పరామర్శకు వెళ్ళిన చంద్రబాబు, అక్కడే గులాబీ పార్టీ నాయకులతో ‘పొలిటికల్ డీల్స్’ మాట్లాడినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాదేదీ రాజకీయానికి అనర్హం. సో, ఏదైనా జరిగి వుండొచ్చు.
అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయుడైన విజయసాయిరెడ్డి ఎందుకు ఇలా చేస్తారు.? అన్నదీ ఓ డౌట్. విజయసాయిరెడ్డి అంటే గిట్టని ఓ వర్గం (వైసీపీలోనే), చంద్రబాబుతో విజయసాయిరెడ్డికి లింకు పెట్టి కథలు అల్లుతోంటే, దానికి టీడీపీ అనుకూల వర్గం మరింత ఆజ్యం పోస్తోంది. అదీ అసలు సంగతి.