ప్రిస్టేజ్ ఇష్యూ… చంద్రబాబు సొంతూరిలో పరిస్థితి ఏమిటి?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని మిగిలిన నియోజకవర్గాలు అన్నీ ఒక ఎత్తయితే.. చంద్రగిరి నియోజకవర్గం మరో ఎత్తు. ఇంకా బలంగా చెప్పాలంటే… కుప్పం కంటే కూడా ఇప్పుడు చంద్రగిరిపైనే టీడీపీ బలంగా కాన్ సంట్రేషన్ చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు పుట్టిన, రాజకీయం మొదలుపెట్టిన ఊరే చంద్రగిరి. దీంతో ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ పసుపు జెండా ఎగరేయాలని బాబు & కో బలంగా భావిస్తున్నారు.

వాస్తవానికి చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో టీడీపీ గెలిచి చాలా కాలమైపోయింది. 1994లో చివరిసారిగా టీడీపీ తరపున చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు గెలిచారు. ఆ తర్వాత చంద్రగిరిలో గెలుపు టీడీపీకి అందని ద్రాక్షలాగ అయిపోయింది. కారణం ఏమిటనేది పూర్తిగా తెలియక పోయినా.. చంద్రబాబు సొంత ఊరిలో టీడీపీని ప్రజలు నమ్మకపోవడం ఆసక్తిగా మారింది.

అయితే ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో చంద్రగిరి నుండి పులివర్తి నాని పోటీచేస్తారని అంటున్నారు. ఇదే సమయంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కొడుకు మబ్బు దేవ నారాయణ రెడ్డిని పోటీచేయించాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తుంది. దీంతో… వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక క్యాడర్లో కన్ ఫ్యూజన్ నెలకొందని, అది ఇప్పుడు పెరిగిపోతుందని అంటున్నారు.

ఈ కన్ ఫ్యూజన్ చాలదన్నట్లుగా తాజాగా రియాల్టర్ డాలర్ దివాకర్ రెడ్డి తెరమీదకు వచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే అంటు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో దివాకర్ రియాల్టర్ గా బాగా పాపులర్. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో తనకు మంచి పట్టుందని.. ఖర్చు కూడా అవసరమైన మేర బలంగా పెట్టుకోగలనని టీడీపీ అధిష్టాణంతో చెప్పారని అంటున్నారు. ఈ విషయంపై సానుకూల స్పందన వచ్చిందని ప్రచారం జరుగుతుంది.

దీంతో… టిక్కెట్ కోసం ట్రయాంగిల్ ఫైన్ అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో మబ్బు దేవ నారాయణ రెడ్డి గతకొన్ని రోజులుగా ఫోకస్ లో ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో దేవనారాయణ రెడ్డి విషయంలో బాబు & కో సెకండ్ ఆప్షన్ కి వెళ్లారా.. లేక, మరో ఆఫర్ ఏమైనా ఇచ్చారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ప్రస్తుతానికి పులివర్తి నాని, డాలర్ దివాకర్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.

వీరిలో పులపర్తి నానీ ఏమో… చాలాకాలంగా చంద్రగిరి పార్టీలో పనిచేస్తుండటంతో పాటు గతంలో ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం కూడా ఉండటంతో రాబోయే ఎన్నికల్లో గెలుపుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరోపక్క డాలర్ దివాకర్ కూడా టిక్కెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని చెబుతున్నారు. ఆర్థిక బలమే ఈ కాన్ ఫిడెన్స్ కి ఒక బలమైన కారణం అనే కామెంట్లూ ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

మరోపక్క వైసీపీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో… ఈసారి చంద్రగిరిలో ఏమి జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈసారి నారా లోకేష్ – చంద్రబాబులు చంద్రగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరోపక్క కుప్పం, మంగళగిరిపై అధికార పక్షం గట్టి కాన్ సంట్రేషన్ పెట్టిందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.