అవకాశాలు లేనప్పుడు సృష్టించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవడం కొందరి లక్షణం. ఇంకొందరు మాత్రం కష్టపడకుండానే ఉన్న పరిస్థితుల్ని తమకు అనుగుణంగా మార్చుకుని ప్రయోజనం పొందాలని చూస్తుంటారు. అలాంటి వారిలో నారా చంద్రబాబు నాయుడు ఒకరు. ఈయన ఎంతసేపూ ఎదుటివారి బలహీనతల మీదే కోటలు కట్టాలని చూస్తుంటారు. అందుకే ఎప్పుడెప్పుడు వైఎస్ జగన్ దొరుకుతారు ఇరికించేసి ప్రయోజనం పొందేద్దామా అని చూస్తూంటారు. ప్రసుతం ఆయనకు పోలవరం అలాంటి వెసులుబాటునే కల్పిస్తోంది. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టిన సంగతి తెలిసిందే. 47 వేల కోట్ల అంచనా వ్యయం ఇవ్వమని అంటూ దాన్ని 20 వేల కోట్లకు కుదించేసింది.
ఆ 20 వేల కోట్లు కనీసం పునరావాస ఏర్పాట్లకు కూడ సరిపోవు. 2017, 18 అంచనా వ్యయం ఇస్తేనే ప్రాజెక్ట్ కట్టగలరు. కానీ బీజేపీ సర్కార్ హోదా తరహాలోనే దీన్నీ అటకెక్కించాలని చూస్తోంది. వచ్చే ఎన్నికలకు హామీగా తమ మేనిఫెస్టోలో చేరుకుకోవాలని భావిస్తోంది. ఢిల్లీలో పూర్తి మద్దతు ఇస్తున్నా జగన్ కు సహకరించట్లేదు. దీంతో జగన్ చిక్కుల్లో పడ్డారు. పోలవరం కట్టడం తప్పనిసరి కాబట్టి ఆయన బీజేపీకి ఎదురుతిరగాల్సిందే. అలా ఎదురుతిరిగితే మోదీతో ఆయన దోస్తీ కట్ అవుతుంది. అప్పుడు బీజేపీ వేరే దిక్కులేక ఎన్నికల నాటికైనా తాను ఇస్తున్న పొత్తు ఆఫర్ ను అంగీకరించి తీరుతుందని చంద్రబాబు ఆలోచన.
అలా కాకుండా జగన్ ఎదురుతిరగకపోతే పోలవరం కల కలగానే మిగిలిపోతుంది. జగన్ తన పదవీకాలం పోరాటయ్యేలోపు ప్రాజెక్ట్ కడతానని చేసిన ప్రతిజ్ఞ గాలిలో కలిసిపోతుంది. అప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టి అధికారం చేజిక్కించుకోవచ్చనే ప్లాన్ బి కూడ ఉంది ఆయన దగ్గర. అంటే జగన్ పోలవరం తేవాలనుకుని పోరాడినా, మోదీతో కయ్యం ఎందుకులే అనుకుని మౌనం వహించినా తనకు బెనిఫిట్ ఖాయమని బాబుగారు భావిస్తున్నారు. ఈ భావనలో కూడ కొంత వాస్తవం లేకపోలేదు. కట్టమంటే కేంద్రానికి కోపం, కట్టించలేకపోతే రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేలా ఉంది జగన్ పరిస్థితి.