ఇన్నాళ్లు తెలుగు రాజకీయాల్లో కులం, సామాజికవర్గం పేర్లు మాత్రమే వినబడేవి. కానీ ఈమధ్య కొత్తగా మతం పేరు వచ్చి చేరింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ వేరు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. కొన్ని నెలల క్రితం దేవాలయాల మీద దాడులు జరిగితే అది ఖచ్చితంగా క్రిస్టియన్ మతస్తుల కుట్రేనని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ సహకరిస్తున్నారని బీజేపీ నేతలు చేసిన వివాదం అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్ కేవలం క్రైస్తవ మాటస్తుడు కావడం మూలంగానే అంత పెద్ద రచ్చ చేశారు బీజేపీ నేతలు. ఇప్పుడు ముస్లిం మతం పేరుతో రాజకీయ విమర్శలు చేసే పని మొదలుపెట్టారు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం సభ్యులు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, తమ మీద అక్రమ కేసులు పెడుతున్నారని, తాను దొంగతనం చేయలేదని, తామెలాంటి తప్పూ చేయలేదని సెల్ఫీ వీడియో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో అబ్దుల సలాం, అతని భార్య, కుమారుడు, కుమార్తె నలుగురూ మరణించారు. ఇందులో పోలీసుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం సైతం వెంటనే స్పందించి ప్రభుత్వం నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఈ విషయంలో విజ్ఞత ఉన్న ఎవరైనా సరే ఒక కుటుంబం అన్యాయంగా బలైపోయిందని, వారి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. బాధ్యత వహించాలని పట్టుబట్టాలి. కానీ 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని ముస్లింల మీద దాడిగా అభివర్ణించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ముస్లిం మైనారిటీల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
వేరే ఎవరైనా చిన్న నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడితే పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా మతం పేరుతో రాజకీయ లబ్దిని పొందాలని తపన పడటం నిజంగా సిగ్గుచేటు అనిపించుకుంటుంది.