నెల్లూరులో చంద్రబాబు వ్యూహం మారింది

నెల్లూరు లోక్ సభ స్థానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి నిలుపుతున్నారు.

ఎపుడో 1999లో చేజారిపోయన ఈ నియోజకవర్గాన్ని 2019లోనయినా టిడిపి ఖాతాలో వేసుకునేందుకు ఆయన వ్యూహం రచిస్తున్నారు. ‘తెలుగు రాజ్యం’కు అందిన సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 23 వ తేదీన ఈ విషయమైజిల్లా నాయకులతో  మేధోమధనం నిర్వహించాలనుకుంటున్నారు.

ఆ రోజు నెల్లూరు జిల్లాలో పేరుమోసిన నాయకులందరితో సమావేశమవుతున్నారు. నెల్లూరు లోక్ సభ స్థానాన్నికైవసం చేసుకోవాలనుకంటే చుట్టూర ఉన్న అసెంబ్లీ స్థానాలను గెల్చుకోవాలి. ఈ వ్యూహంతో ఆయన అభ్యర్థులను ఖరారుచేసేందుకు సిద్ధమవుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన నెల్లూరు లోక్ సభకు వైసిపి రెబెల్స్ ను రంగంలో కి దించితే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. పైకి బిసి గీసి అని అరుస్తున్నా, లోపల ఆయన నెల్లూరు వంటి సీటును గెల్చుకోవాలంటే సామాజిక న్యాయం పనికిరాదని, డబ్బు కులమే ముఖ్యమని నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

అందుకే తనకు అత్యంత సన్నిహితుడుదయిన బీద మస్తాన్ రావుకు బదులు వైసిపిలో జగన్ మీద తిరుగుబాటు చేసి తెలుగుదేశంలోకి వచ్చిన ఇద్దరు ప్రముఖ రెడ్ల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్రంలో బిసిలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు రకరకాల హామీలుఇస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక దశలో తెగ బిసి ఆవేశం తెచ్చుకుని నెల్లూరు లోక్ సభ స్థానాన్ని బిసి అభ్యర్థికి కేటాయించాలని, దానికి బీద మస్తాన్ రావు సరైన నాయకుడుని భావించారు.

ఇపుడంతా బిసి గాలి, రిజర్వేషన్ల గాలి వీస్తున్నందున బిసి ప్రయోగం చేయాలనుకున్నారు.అయితే, 2019 ఎన్నిక తనకు చాలా కీలకమయినది కావడం, దానికితోడు రెడ్లు బలంగా నియోజకవర్గంలో బిసి ప్రయోగం చేయడం తగదని ఆయనకు జిల్లాలోని సీనియర్ నేతలు సలహా ఇచ్చారని తెలిసింది. దీనితో ఆయన వ్యూహం మారింది.

అయితే, తెలుగు దేశం ఎంపిలను వైసిపి ఎరవేసి లాక్కుంటున్నందున ఆయన ఈ వ్యూహం మార్చుకుని నెల్లూరు లో వైసిపి నుంచి వచ్చిన ఇద్దరు రెడ్ల అభ్యర్థులలో ఒకరిని నిలబెడితే జగన్  మీద దాడిచేయడం సులభమవుతుందని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది.

ఈ మధ్యనే వైసిపి నేత జగన్మోహన్ రెడ్డితో విభేదించి జిల్లా పరిషత్ ఛెయిర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టిడిపిలో చేరారు. ఇలాగే మరొక మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి కూడా ఇపుడు జగన్ మీద ద్వజం ఎత్తుతున్నారు. టిడిపి సీటు ఇస్తే పార్టీలో చేరతానని కూడా అంటున్నారు. వీరిద్దరు వైసిపి నేత జగన్ తో గొడవ పడిన వారు కాబట్టి, రేపు ఎన్నికల ప్రచారంలో జగన్ కు ధీటుగా విమర్శించి, జగన్ గుట్టువిప్పండంలో ముందుంటారని ఆయన ప్లాన్.

ఇదే విధంగా మరొక రెడ్డి నేత కేంద్ర సహకార బ్యాంక్ ఛెయిర్మన్ మెట్టుకూరు ధనంజయ్ రెడ్డి పేరు కూడా ఆయన పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఎంపి అభ్యర్థి విజయం సులువయ్యేందుకు బలమయిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆయన నిర్ణయించారు.

నెల్లూరు లోక్ సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కీలకమయినవి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటి. నెల్లూరు సిటి కు మంత్రి నారాయణ పేరును, రూరల్ కు ఆదల ప్రభాకర్ రెడ్డి పేరును ఖారారు చేసినట్లు తెలిసింది. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కందుకూరు (ప్రకాశం జిల్లా) నియోజకవర్గాల అభ్యర్థుల కోసం కసరత్తు నడుస్తూ ఉంది. ఇదంత 23న పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.