వైరల్ ఇష్యూ… ఊరు వెళ్లి ఉత్తరం రాస్తాను అన్నది అందుకేనా?

ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 1 శాతం కూడా ఓట్ల షేర్ దక్కలేదనేది తెలిసిన విషయమే. ఇప్పుడు 2024 ఎన్నికల సమయానికి అదేమీ పదిరెట్లు పెరిగిపోయిందీ లేదు! అయోధ్యలో రామ మందిరం నిర్మించాం కాబట్టి ఏపీలో ఓట్లశాతం పెరిగిపోతుందంటే అది కచ్చితంగా రాజకీయంగా అవగాహన లేని ఆలోచన అనే చెప్పుకోవాల్సి ఉంటుంది! ఇటీవల జరిగిన సర్వే ఫలితాలు కూడా ఏపీలో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం ఆల్ మోస్ట్ అతిస్వల్పం అని అంటున్నారు!

ఇక గత ఎన్నికల్లో జనసేనకు ఐదున్నర శాతం కంటే ఎక్కువగానే ఓట్ల షేర్ దక్కింది! ఇప్పుడు అది మరికాస్త పెరిగిందని అంటున్నారు. పైగా ఈసారి ఎన్నికల్లో జనసేనకు అడిగినన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చి కాపులను మెప్పించగలిగితే కూటమికి అధికారం ఖాయమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అలా కాకుండా పాతికో, పరకో చేతిలో పెడితే ఒరిగేది శూన్యమనే మాటలూ ఉన్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో 1 శాతం కంటే తక్కువ ఓట్ షేర్ ఉందనే విషయం మరిచిపోయారో లేక, చంద్రబాబుకు తమ అవసరం ఉంది తప్ప, తమకు చంద్రబాబు అవసరం లేదని ఫిక్సయ్యారో తెలియదు కానీ… భారీ స్థాయిలో సీట్లు అడుగుతున్నారట బీజేపీ పెద్దలు. ఇందులో భాగంగా… 35 అసెంబ్లీ, 8 లోక్ సభ సీట్లు కేటాయించాలని అమిత్ గట్టిగా చెప్పారట. దీంతో… ఈ విషయం తెలిసి టీడీపీ నేతలు షాక్ తిన్నారని అంటున్నారు.

ఆ విధంగా అమిత్ షా 35 + 8 అనగానే… చంద్రబాబు మాత్రం 4 పార్లమెంటు, 15 అసెంబ్లీ సీట్లిస్తామని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే… అందుకు అమిత్ షా ఒప్పుకోలేదని సమాచారం. ఇదే సమయంలో… 2014 ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నప్పుడే 15 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్లలో పోటీచేసిన విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారని చెబుతున్నారు. అందుకు అంగీకారం చెప్పకపోతే ఒంటరిగా పోటీచేసుకుంటామని స్పష్టం చేశారని సమాచారం!!

దీంతో బాబు తీవ్ర సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు. కారణం… బీజేపీ అడిగినట్లు 35, జనసేనకు 25 అసెంబ్లీ సీట్ల ఇస్తే రెండింటికే 60 అసెంబ్లీ సీట్లు పోతాయి. అలాగే పది పార్లమెంటు (8 బీజేపీ – 2 జనసేన) సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది. ఇన్నేసి సీట్లు ఆ రండు పార్టీలకు ఇవ్వాలంటే… 60 మంది టీడీపీ నేతలను బుజ్జగించాలి.. కేడర్ ను శాంతింపచేయాలి.. అంతకంటే ముందు అధికారం వచ్చే అవకాశం ఉంటే.. వీరి పెత్తనాన్ని భరించాల్సి ఉంటుంది.

ఆ సంగతి అలా ఉంటే… 1 శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ అన్ని సీట్లు అడిగితే… ఇక తామెన్ని సీట్లు డిమాండ్ చేయాలనే ఆలోచన జనసేన నేతలకు వచ్చిందని తెలుస్తుంది. ఈ లెక్కన జనసేన నేతల మనసుల్లో ఉన్న 40 – 50 సీట్లు కూడా ఇవ్వాలని అడగాల్సి ఉంటుందని అంటున్నారని తెలుస్తుంది. దీంతో… ఈ విషయంపై ఏమీ మాట్లాడకుండానే చంద్రబాబు అమిత్ షా కు బై చెప్పి… ఊరెళ్లి ఉత్తరం రాస్తాను అన్నట్లుగా వచ్చేశారని సమాచారం.