నవ్విపోదురు గాక నాకేటి…. కోనసీమలో బాబు కోతలు!

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ఆ అధినేత సంగతి ఏమిటి? ఈ విషయం ఏవరి ఊహకు వారికి వదిలేస్తే… ఊహించుకోవడానికి సైతం ధైర్యం చాలడంలేదన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా గ్యాప్ లేకుండా జనాల్లో ఉంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు దగ్గరకొచ్చిన జనాలతో.. తోకలు కత్తిరిస్తానని మాట్లాడిన చంద్రబాబు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడూ జనాల దగ్గరకు వస్తున్నారు. వస్తే వచ్చారు కానీ… ఈ సందర్భంగా ఆయన చెబుతున్న మాటలే ఒకింత ఆశ్చర్యాన్ని.. ఇంకాస్త చికాకునీ తెప్పిస్తున్నాయని అంటున్నారు.

అవును… సుమారు 40ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పంచేసిన నాయకుడిలా చంద్రబాబు మాట్లాడటం లేదు! పోనీ గతంలో తాను పాలించిన పాలన మరోసారి తీసుకొస్తానని చెప్పే ధైర్యం చేయడం లేదు. ఫ్యూచర్ బాగుటుందని పాత చింతకాయ పచ్చడి కబుర్లు మాత్రం చెబుతున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా కోనసీమ జిల్లా మండపేటలో పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైతును రాజు చేస్తానన్నారు. పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానని.. పెట్టుబడులు తీసుకొస్తారట.. పేదలందరినీ ధనవంతులను చేస్తానన్నారు.. సంపద సృష్టిస్తానని చెప్పారు.. ఇలా ఊకదంపుడుగా ఎన్నో ఎన్నెన్నో చెప్పారు.

ఒక్కమాటలో చెప్పాలంటే… తాను అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏమేమి చెయ్యలేదో అవన్నీ ఈసారి చేస్తానని చెబుతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఇప్పుడు చెప్పిందాంట్లో ఒక్కటైనా చేశారా అంటే.. సమాధానం చెప్పకుండా జగన్ పై బురదజల్లుతున్నారు. జగన్ పోవాలని అంటున్నారు. సమాధానం మాత్రం దాటవేస్తున్నారు.

ఇందులో భాగంగా… రాజధాని అమరావతిని జగన్ నాశనం చేశారని.. రైతులను జగన్ నిండా ముంచేశారని. యువతను నమ్మించి మోసం చేశారని.. మహిళలు, యువత, పిల్లలు, రైతులు ఏ వర్గాన్ని తీసుకున్నా జగన్ పాలనపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. జగన్ అనే సైకో అధికారంలో నుండి దిగిపోతే కానీ రాష్ట్రం బాగుపడదని కూడా బాబు చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగని బాబు… రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… గతం సంగతి కాసేపు పక్కనపెట్టి 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి అయినా సంపూర్ణంగా అమలు చేసి ఉంటే.. 2019లో ఎందుకు అంత ఘోరంగా ఓడిపోతారు. ఈ చిన్నపాటి స్వీయ విశ్లేషణ చంద్రబాబులో మాత్రం కనబడకపోవడం గమనార్హం.