జనాలొస్తున్నారు స‌రే…ఓట్లుగా మార్చుకోగ‌ల‌రా?

జ‌గ‌న్మోహన్ రెడ్డి పాద‌యాత్ర‌కు ఉత్త‌రాంధ్ర‌లో ఎంతో కీల‌క‌మైన విశాఖ‌పట్నం జిల్లాలో జ‌నాల స్పంద‌న నిజంగా అపూర్వ‌మ‌నే చెప్పాలి. తూర్పుగోదావ‌రి జిల్లా నుండి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోకి ఎంట్రీ పాయింట్ అయిన న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌ర్గం వ‌ద్దే జ‌నాలు బ్ర‌హ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. కాబ‌ట్టి అదే ఊపు జిల్లాలో పాద‌యాత్ర జ‌రిగిన‌చోట‌ల్లా క‌న‌బ‌డింది. న‌గ‌రంలోని కంచ‌ర్ల‌పాలెం బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చిన జ‌నాల‌ను చూసి తెలుగుదేశంపార్టీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోయార‌న‌టంలో సందేహం లేదు.


జిల్లాలో పాద‌యాత్ర జ‌రిగిన చాలా చోట్ల ఎంత‌ వ‌ర్షం ప‌డుతున్నా లెక్క‌చేయ‌కుండా జ‌నాలు జ‌గ‌న్ కోసం ఎదురు చూడ‌టం, ప్ర‌సంగం అయిపోయినా వ‌ర్షంలో అలానే నిల‌బ‌డుంటం చూస్తేనే జ‌గన్ అంటే జ‌నాల్లో ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్ధ‌మైపోతోంది. కాబ‌ట్టి ఉత్త‌రాంధ్ర‌లోని మిగిలిన విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లో కూడా ఇదే విధ‌మైన అభిమానం ఉంటుంద‌ని అంచ‌నా వేయొచ్చు. క్రౌడ్ మ్యానేజ్మెంట్ కూడా కొంచెం ఉంటే ఉండొచ్చు కాద‌న‌లేం. అస‌లంటూ జ‌నాల్లో అభిమానం లేక‌పోతే ఎంత మ్యానేజ్మెంట్ అయినా జ‌నాలు వ‌ర్షంలో త‌డుస్తూ కూడా నిల‌బ‌డ‌రు క‌దా ?

ఇతంతా ఓకేనే. కానీ నేత‌ల్లోనే పార్టీపై ఎంత క‌మిట్మెంట్ ఉంది ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌టానికి ఎంత‌మంది గ‌ట్టి అభ్య‌ర్ధులున్నారు ? ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి విజ‌యావ‌కాశాలున్నాయి ? లాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటే స‌మాధానాల కోసం త‌డుముకోవాల్సిందే. ఎందుకంటే, పోయిన ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసిపి గెలిచింది కేవ‌లం తొమ్మిది మాత్ర‌మే. మిగిలిన 25 నియోజ‌క‌వ‌ర్గాలు అప్ప‌ట్లో మిత్ర‌ప‌క్షాలైన టిడిపి, బిజెపిలు గెలుచుకున్నాయి.

అప్ప‌ట్లో కూడా పార్టీపై జ‌నాల్లో అభిమానం ఉన్నా దాన్ని ఓట్లరూపంలో మ‌లుచుకోవ‌టంలో అభ్య‌ర్ధులు, నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. పోటీ చేసిన అభ్యర్ధులను కూడా అన్నీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ గ‌ట్టి వాళ్ళ‌ని పెట్ట‌లేదు. చివ‌రి నిముషం వ‌ర‌కూ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టిక్కెట్లివ్వ‌లేదు. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ప్ర‌చారంలోను, పోలింగ్ సంద‌ర్భంగా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌టంలో కూడా చాలా మంది అభ్య‌ర్ధులు విఫ‌ల‌మ‌య్యారు. దానివ‌ల్లే వైసిపి ఓడిపోయింది.


పోయిన ఎన్నిక‌ల్లో అంటే ఏదో అయిపోయింద‌ని స‌రిపెట్టుకోవ‌చ్చు. మ‌రి రాబోయే ఎన్నిక‌ల‌కు పార్టీ సిద్ధంగా ఉందా ? అస‌లే ప్ర‌త్య‌ర్ధి టిడిపి చాలా బ‌లంగా ఉంది. అంత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్ధిని ఢీ కొట్టాలంటే ఇంకెంత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి ? అభ్య‌ర్ధుల‌ను ముందుగానే ఖారారు చేయాలి. పోటీ చేయ‌బోయే అభ్య‌ర్ధులు అన్నీ విధాలుగా గ‌ట్టి వారై ఉండాలి. ప్ర‌చారంలోనే కాదు, పోల్ మ్యానేజ్మెంట్ లో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అపుడే జ‌గ‌న్ పాద‌యాత్ర స‌క్సెస్ అయిన‌ట్లు లెక్క‌. లేక‌పోతే పోయిన ఎన్నిక‌ల ఫ‌లితాలే పున‌రావృత‌మైనా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు .