థ్యాంక్స్ టు కేటీఆర్… ఏపీ జనాలకు బీఆరెస్స్ గుడ్ న్యూస్!

ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకు చేతకాని పని బీఆరెస్స్ నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ మొదలుపెట్టి చూపించారు! లోక్ సభలో 23 మంది ఎంపీలు కలిగి, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ… కేంద్రంలో చక్రాలు తిప్పి, రాష్ట్రపతులను సైతం నియమించినట్లు చెప్పుకునే అధినేత ఉన్న ఏపీ ప్రతిపక్షం టీడీపీ… తమపార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏపీలో అసమర్ధతతో మిగిలిపోయిన బీజేపీ… ప్రశ్నించడానికే పార్టీపెట్టామని చెప్పుకునే బీజేపీ మిత్రపక్షం జనసేన… మా తాతలు నేతులు నాకారని చెప్పుకునే సీపీఎం – సీపీఐ… ఇన్ని పార్టీలున్నా జరగనిది తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో పార్టీ పెట్టిన బీఆరెస్స్ నేతల వల్ల అయ్యేలా కనిపిస్తుంది! అదే… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడే పని!

అదేంటి..? ఏపీలో పార్టీలు పోరాడుతున్నాయిగా… అంటారా? ఇంతకాలం ఏపీ రాజకీయ నాయకులు చేసిందేమిటంటే… ఢిల్లీ వెళ్లి అది తప్ప అన్నీ మాట్లాడే జగన్. మోడీ పేరెత్తితే అంతదూరం పారిపోతున్నట్లు కనిపిస్తున్న చంద్రబాబు. నన్ను గాజువాకలో ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం గట్టిగా నిలబడేవాడినని చెప్పుకునే జనసేన అధ్యక్షుడు పవన్. మోడీని జగన్ ప్రశ్నించడ లేదని విమర్శలకు మాత్రమే పరిమితమైన సీపీఎం – సీపీఐ. వీరిలో ఎవరు పోరాడారు? విశాఖ కోసం ఎవరు నిలబడ్డారు? సమాధానం తెలిసిన ప్రశ్నలివి!

తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు తెలంగాణ మంత్రి, బీఆరెస్స్ నేత కేటీఆర్.

అవును… తన కార్పోరేట్ మిత్రులకు లాభం చేకూర్చడం కోసమే మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడాన్ని తక్షణం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. తన కార్పోరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోడీకి, విశాఖ‌ స్టీల్ ప్లాంట్ పట్ల సానుభూతి ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని కోరారు.

ఇదే క్రమంలో… గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్… లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ను అతి తక్కువ ధరకు అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని సూచించారు. అదేవిధంగా… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి బీఆరెస్స్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో… కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీఆరెస్స్ పార్టీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ కు కేటీఆర్ సూచించారు.

కాసేపు రాజకీయ అవసరాల సంగతి పక్కనపెడితే… ఏపీ వాసులకు ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రస్థాయి టీఆరెస్స్ నుంచి జాతీయస్థాయి బీఅరెస్స్ గా మారిన పార్టీ… ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోకుండా ఆపడానికి తనవంతు కృషిచేస్తామని చెప్పడం శుభసూచికమనే అనుకోవాలి. మరి ఈ విషయంలో ఇప్పటికైనా ఏపీ రాజకీయ పార్టీల అధినేతలు స్పందిస్తారా… లేక, మోడీ పేరు చెబితే ఫ్యాంటులు తడిచిపోతున్నాయన్న విమర్శలకు బలం చేకూరుస్తారా… అన్నది వేచి చూడాలి!