బ్రేకింగ్ : ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని, ఏపీలో స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాయిదా కోరుతూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం తోసిపుచ్చింది.ఈ సందర్భంగా ధర్మాసనం ఉద్యోగ సంఘాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు పనిచేయకుండా, పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వెలిబుచ్చింది.

YS Jagan's case gets national wide attention

ఏపీ పంచాయతీ ఎన్నికల అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు విని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారం సుప్రీంకు చేరడానికి ముందు అనేక పరిణామాలు జరిగాయి.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా, ఎన్నికలు వద్దంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే ఎస్ఈసీ దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఎన్నికలు జరపొచ్చంటూ ద్విసభ్య ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో అసంతృప్తికి లోనైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికితోడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం, ఏపీఎన్జీవోలు, కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే సుప్రీం కోర్టు లో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బే తగిలింది. తాజా తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలగినట్టుయింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా ఇక నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోనుంది.