ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ సెక్రటరీ డాక్టర్ ఈ సి వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చెవిటి, మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి అని సిఎం జగన్ సూచించారు. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలి అని జగన్ ఆదేశించారు. పాదయాత్రలో కనీసం 100 మంది పిల్లలు నా దగ్గరకు వచ్చారు అని ఆయన అన్నారు. ఇలాంటి వైకల్యంతో బాధపడేవారికి అండగా ఉండాలన్నదే లక్ష్యం అని ఆయన స్పష్టం చేసారు.
చెవిటి, మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై సమావేశంలో చర్చ జరిగింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో అనుసంధానం చేయడంపై సమావేశంలో చర్చ జరిగింది. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా శబ్ధగ్రహణ పరీక్షలపై సమావేశంలో చర్చించారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందని తెలిపారు.