తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు శనివారం నుంచి రాజమండ్రిలో జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లతో వేమగిరి సభా ప్రాంగణం సిద్ధమైంది. తొలిరోజు సభకు పార్టీ అభిమానులు.. నేతలు.. కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈసారి మహానాడు టీడీపీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుందని.. దానికి కారణం, త్వరలో ఎన్నికలు ఉండటమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సందర్భంలో ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’లో వచ్చిన ఒక కథనం టీడీపీ శ్రేణులను టెన్షన్ పెడుతుంది!
ఈరోజు ఈనాడులో వచ్చిన ఒక కథనం “సంక్షేమానికి నిలువెత్తు రూపం.. ఎన్టీఆర్”! లో ఒక లైన్ టీడీపీ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తుంది. పార్టీ పరంగా చంద్రబాబే.. ఎన్టీఆర్ కు అనధికారిక వారసుడేమో కానీ… ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు, పాలనపైనా, ప్రజాశ్రేయస్సుపైనా ఆయనకున్న ఆలోచనా విధానానికి జగన్ వారసుడేమో అనే అనుమానం వారిని మరింత ఆందోళనలో పాడేస్తుంది. ఇంతకూ ఆ కథనంలో ఏముంది… తమ్ముళ్లను అంతగా టెన్షన్ పెడుతున్న ఆ అంశం ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం!
ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. “రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం హైదరాబాద్ (రాజధాని) లోనే లేదు. సామాన్య ప్రజానీకం వద్దకు పోయి.. పేదవాడి తలుపు తట్టి మీ సమస్యలేంటి అని తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. ఆ భావంతోనే అధికార వికేంద్రీకరణ చేసి, ఎక్కడి వారికి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అందించినప్పుడే సక్రమమైన సంక్షేమం. అందుకే మండలాలను ఏర్పాటు చేశాం” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అని ఈనాడు రాసుకొచ్చింది. ఇది అక్షరాలా నిజం! అయితే ఎన్టీఆర్ తర్వాత ఆ ఆలోచన చేసి, ఆ దిశగా పరిపాలనా వికేంద్రీకరణకు ఆలోచన చేసి, అమలు చేసింది ఎవరు..?
గ్రామస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థను, గ్రామ సచివాలయాలనూ తీసుకొచ్చింది ఎవరు? నేడు ‘ఈనాడు’ రాసినట్లు, నాడు ఎన్టీఆర్ చెప్పినట్లు… “సామాన్య ప్రజానీకం వద్దకు పోయి.. పేదవాడి తలుపు తట్టి మీ సమస్యలేంటి అని తెలుసుకుని వాటిని పరిష్కరించాలి” అనే లైన్ లో ఆ పని చేస్తుంది ఎవరు? ఇంటింటికీ పెన్షన్ పంపించాలని, రేషన్ తీసుకోవడాని కాళ్లీడ్చుకుంటూ అవ్వాతాతలు షాపు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటిముందుకే పంపిస్తుంది ఎవరు? ప్రస్తుతం ఈ ఆలోచనలు టీడీపీ శ్రేణులను టెన్షన్ పెడుతున్నాయని చెబుతున్నారు.
మరి ఇలా ఎన్టీఆర్ ని పొగడాలనే ఆలోచన రామోజీరావుకి రావడం, ఆయన్ని మహోన్నతుడు అని చెప్పి ఆయన నుంచి లాక్కున్న పార్టీకి ఓటు వేయాలని పరోక్షంగా ప్రజలకు చెప్పడం కాస్తా… బౌన్స్ బ్యాక్ అయ్యి… నిజంగా ఎన్టీఆర్ కి అసలు సిసలు వారసుడు ఎవరు అనే చర్చను తెరపైకి తెచ్చింది ఈనాడు కథనం!
దీంతో శుభమాని మహానాడు జరుపుకుంటుంటే… ఇలాంటి కథనం ఇచ్చి ప్రజల్లో జగన్ – ఎన్టీఆర్ ఒకటే ఆలోచనతో ప్రజల గురించి ఆలోచిస్తారనే సంకేతాలు ఇచ్చినట్లయ్యిందని తమ్ముళ్లు తెగ టెన్షన్ పడుతున్నారంట!