నష్టాల నుంచి బయటపడేందుకు ఏపీఎస్ ఆర్టీసి సరికొత్త అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ప్రతి గ్రామానికి బస్సులు వెళుతున్నప్పుడు ప్రయాణికులను మాత్రమే తీసుకువెళుతున్నారు. ఏవైనా చిన్న చిన్న పార్సీల్లు ఉంటే వాటిని డ్రైవర్లు కండక్టర్లు తీసుకు వెళ్లేవారు. వాటి పై వచ్చే ఆదాయాన్ని వారు మాత్రమే తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆర్టీసి సరికొత్తగా ప్రాంతాలతో పని లేకుండా పార్సిళ్లను కావాల్సిన చోటికి డెలీవరీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడలో ఇంటింటికి పార్సిల్లను చేరవేసే కార్యక్రమాన్ని ప్రయోగవంతంగా ఆర్టీసి మొదలు పెట్టింది. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆర్టీసి యోచిస్తోంది.
సరుకులను రవాణా చేయడం ద్వారా బాగా సంపాదించవచ్చని దానితో సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని ఆర్టీసి భావిస్తోంది. ఇందుకోసం డెలివరీ ఏజెన్పీలను ఏర్పాటు చేయాలని భావించి టెండర్లు కూడా ఆహ్వానించింది. త్వరలోనే వీటిని ఖరారు చేసి విజయవాడలో పెద్ద ఎత్తున పార్సిళ్లను డోర్ డెలివరీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.
వాస్తవానికి ఏపిఎస్ ఆర్టీసి 2017-18 లో కృష్ణా జిల్లాలో పార్సిల్, కొరియర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దాంతో ఆ సంవత్సరంలో 7 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. 2018-19 లో ఇప్పటికే 12 కోట్లు సంపాదించింది. ఆర్టీసి బస్సులు ప్రతి పల్లెకు వెళుతుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఏ ప్రాంతానికైనా ఒక్క రోజులోనే డెలివరీ చేస్తే మంచి పేరుతో పాటు నమ్మకం ఏర్పడుతుందని ఆర్టీసి భావిస్తుంది.