తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో వర్షాలు ఎప్పుడైనా మొదలయ్యే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా ఉంది. అలాగే మధ్య కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతున్న తూర్పు–పశ్చిమ ద్రోణి రాష్ట్రంలో వర్షాల మోస్తు పెంచనుంది. జూలై 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి.
ఈ పరిణామాల కారణంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని. ఉరుములు, మెరుపులు, 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చుని తెలుస్తోంది. మూడు రోజులు వరుసగా అక్కడ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉండగా, ఒక్కోచోట భారీ వర్షాలు పడతాయి.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. అన్ని జిల్లాల్లోనూ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించింది.
ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఆకాశంలో మెరుపులు పడుతుంటే చెట్ల కింద, నిర్మాణాలు లేని ప్రదేశాల్లో నిలవకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. రైతులు, తోటమాల యజమానులు కూడా పంటలను గాలులు, వానలకు దూరంగా రక్షించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంచిపోవడం, తాత్కాలిక రవాణా అంతరాయం వంటి సమస్యలు ఎదురవచ్చు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. వచ్చే మూడు రోజులు వానలు ఎలా వస్తాయో చూడాలి గాని, జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలి.
