సీనియర్ ఫొలిటీషియన్ .. కానీ, ఏం లాభం, వయసు మీద పడ్తోంది కదా.. ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో తెలియనంత చాదస్తం పెరిగిపోయినట్టుంది. అది నిజం కాకపోతే పంచాయితీ ఎన్నికల వేళ, టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు ఎలా విడుదల చేయగలిగారు. పంచాయితీ ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తారు. రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులేవీ వుండవు పంచాయితీ ఎన్నికల కోసం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పంచాయితీ ఎన్నికల్ని చంద్రబాబు చూసి వుంటారు.
చివరికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై గుస్సా అయ్యారు. వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో మేనిఫెస్టోపై టీడీపీ వివరణ కోరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఆ వివరణ సహేతుకంగా లేకపోవడంతో, మేనిఫెస్టోపై గుస్సా అయ్యారు. మేనిఫెస్టోని వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఇప్పటిదాకా నిమ్మగడ్డని టీడీపీ మనిషిగా వైసీపీ అభివర్ణించింది. ఇకపై, నిమ్మగడ్డను వైసీపీ మనిషిగా టీడీపీ అభివర్ణించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వైఎస్సార్ కడప జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో నిమ్మగడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగిడేస్తూ, ఆయన పట్ల భక్తిని చాటుకున్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లోనే టీడీపీకి చాలా డౌట్లు వచ్చేశాయ్ నిమ్మగడ్డ విషయంలో. ఇప్పుడు ఆ డౌట్లు మరింతగా పెరుగుతాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇంతకీ, టీడీపీ మేనిఫెస్టోని నిమ్మగడ్డ వెనక్కి తీసుకున్నారు గనుక, వైసీపీ.. నిమ్మగడ్డ విషయంలో హ్యాపీయేనా. లేదంటే, ఇంకా ‘నిమ్మగడ్డ చంద్రబాబు మనిషే’ అని అంటూనే వుంటుందా. ఏమోగానీ, నిమ్మగడ్డ ఇచ్చిన ఝలక్, తెలుగుదేశం పార్టీకి అలాంటిలాంటిది కాదు.