వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. పుష్పా శ్రీవాణికి ఇదే తొలి కాన్పు. తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించడం పట్ల ఆమె కుటుంబంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. తల్లీ-బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పుష్పా శ్రీవాణికి 2014లో వివాహమైంది. ఆమె భర్త శతృచర్ల పరీక్షిత్ రాజు. ఆయన వైఎస్సార్పీపీ అరకు లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకుడిగా వ్యవహరిస్తున్నారు. వివాహం అనంతరం ఆమె విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగిలో స్థిరపడ్డారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ రెండు ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని నమోదు చేశారామె. అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యే సమయానికి ఆమె వయస్సు 26 సంవత్సరాలే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే పుష్పా శ్రీవాణికి వివాహమైంది. 2019లో 26 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్‌లో ఆమెకు చోటు కల్పించారు. ఉప ముఖ్యమంత్రి హోదాను అప్పగించారు
ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు ఆ దంపతులకు ఫోన్ చేసి, విషెష్ చెప్పారు.