అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో చేసిన ఒక్క ట్వీట్‌ను పట్టుకు ని అధికార, ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొడుతున్నాయని ఏపీ బీజేపీ ఆరోపించింది. ‘‘ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినా ఉద్యమం ఎందుకు?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కీలక వాటా కొరియా కంపెనీ పోస్కోకు విక్రయిస్తున్నట్లు సంకేతాలు అందడంతో కార్మికులతో పాటు అధికార, ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులను కలిసి వచ్చిన సోము వీర్రాజు, జీవీఎల్ విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వైసీపీ, టీడీపీ కలిసిపోయి బీజేపీపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యాన్ని హేళన చేసిందని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు, మతమార్పిళ్లను హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రధాన పోటీదారు అవుతుందన్న భయంతో వైసీపీ, టీడీపీ విశాఖలో డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత మార్పిళ్లు, ఆలయాలపై దాడుల గురించి ప్రశ్నించకూడదనే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమను ఏకాకిని చేసేందుకు కుట్రపన్నాయని జీవీఎల్ మండిపడ్డారు. ఆలయాల ఘటనలపై సిట్ ఏర్పాటైనా రామతీర్థం నిందితులెవరో తేల్చలేదని, అదో కంటితుడుపు చర్యని ఎద్దేవా చేశారు. మున్నిపల్ ఎన్నికలు ముగిశాక కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపడతామన్నారు. అయితే, మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.