ఏపీలో విపక్షాలకు కొదవలేదు. అధికార వైసీపీ తప్ప ఏపీలో ఉన్న మిగిలిన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ విపక్షాలే. వీటిలో ఒక్క సీటు ఉన్న పార్టీలూ ఉన్నాయి.. ఒక్క శాతం ఓటు లేని పార్టీలు కూడా ఉన్నాయి. ఓట్లూ సీట్లూ లేకపోయినా… గంభీరంగా మైకుల ముందు మాట్లాడే నేతలు పుష్కలంగా ఉన్న పార్టీలూ ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ఉమ్మడిగా ఒక సమస్య ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అవును… ఏపీలో విపక్షాలు కుప్పలు తెప్పలుగా ఉన్నప్పటికీ వాటికి ఉన్న అతిపెద్ద సమస్య స్పష్టత లేకపోవడం, స్పష్టంగా మాట్లాడకపోవడం, ఫలితంగా వారు చేస్తోన్న విమర్శలకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేకపోవడం. దీంతో అధికారపక్షంపై ప్రతిపక్షాలు ఏ విమర్శ చేసినా.. దాన్ని ఒకటి రెండు మీడియా ఛానళ్లు మినహా మిగిలిన ప్రజానికం సీరియస్ గా తీసుకోకపోవడం.
ఈ విషయంలో ముందుగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తోన్న టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 2019లో తగిలిన దెబ్బ, తర్వాత కోవిడ్ దెబ్బ అనంతరం ఈమధ్య జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వరకూ టీడీపీ స్థబ్ధగానే ఉంది. చలనం లేనట్లుగానే ఉంది. అయితే ఆ ఎన్నికల్లో ఫలితాలు కాస్త ఉత్సాహం తీసుకొచ్చాయి.
ఆ తర్వాతా చంద్రబాబు కొడుకుని రంగంలోకి దింపారు. యువగళం పాదయాత్ర అంటూ పంపించారు. ఈ సమయంలో అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఎవరు చేసే విమర్శలోనూ స్పష్టత లేకపోవడం గమనార్హం. కారణం… లోకేష్ కు ప్రత్యక్షంగా ఇవి రెండో ఎన్నికలు అయినప్పటికీ… ఇప్పటికే 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం బాబు సొంతం.
దీంతో చంద్రబాబు ఏ విమర్శ చేసినా… ఇంతకాలం ఏమి చేశావని కొంతమంది వైసీపీ నేతలు చెబుతుంటే… ఈ 14ఏళ్లూ గాడిదలు కాశావా అంటూ రోజా లాంటి నేతలు విరుచుకుపడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా సైలంటుగా ఉన్నారు కానీ.. కొడాలి నాని లాంటి వారైతే ఏకవచనంతో కాస్త రూడ్ గా స్పందిస్తూ… నమ్మేవారు ఎవరూ లేరని చెబుతుంటారు. ఈ విమర్శలకు చంద్రబబు దగ్గర స్పష్టమైన కౌంటర్ లేదు.
ఇక జనసేన విషయానికొస్తే… పరిపూర్ణమైన అస్పష్టతకు స్పష్టమైన నిదర్శనం పవన్ కల్యాణ్ అన్నట్లుగా ఉంటుంది రాజకీయాల్లో ఆయన ప్రవర్తన. ఇందులో భాగంగా… పవన్ పార్టీ పెట్టినప్పటినుంచీ ఆయన ప్రసంగాలు ఒక్కొక్కటిగా వింటూ.. నేటి వారాహి యాత్ర, ఢిల్లీలో ఎన్ డీయే కూటమి సమావేశం అనంతరం మంగళగిరిలో చేసిన ప్రసంగం వరకూ క్లారిటీ మిస్!
ఏ విషయంలోనూ పవన్ కల్యాణ్… ఇప్పటివరకూ జనాల్లో చెప్పిన స్టాండ్ కి నిలబడి లేరన్నా అతిశయోక్తి కాదు. దీంతో పవన్ ఏ విమర్శ చేసినా… ప్రభుత్వం కంటే ముందు జనాలే కౌంటర్లు వేసేస్తున్నారు. నెటిజన్లే సమాధాన్లు ఇచ్చేస్తున్నారు. ట్రోల్స్ – మీంస్ సంగతి చెప్పేపనే లేదు. దీంతో… కన్ ఫ్యూజన్ విషయంలో పవన్ ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయతిస్తున్నట్లుగా ఉంది వ్యవహారం.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయానికొస్తే… హస్తినకూ ఏపీకీ చాలా దూరం అనే విషయం నిత్యం స్పష్టమవుతూ ఉంటుంది. ఏపీ బీజేపీకి చీఫ్ లు మారుతుంటారు తప్ప.. వారి మాటల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. పైగా… కేంద్రంలోని ఆ పార్టీ మంత్రులు చెప్పే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు.
దీంతో ఏపీలో తాజాగా బీజేపీ అధ్యక్షురాలు అయిన పురందేశ్వరిని కూడా టీడీపీ భజన బ్యాచ్ లో ఒకరిగా కలిపేస్తున్నారు వైసీపీ నేతలు. వాస్తవాలు ఒకలా ఉంటే.. అదే విషయాలను కేంద్రమంత్రులు స్పష్టం చేస్తుంటే… ఏపీలో మాత్రం టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు అనుగుణంగానే రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తోన్న పరిస్థితి.
ఇక మిగిలిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మొదలైన పార్టీలో కీలకమైన నేతలు.. మైకుల ముందు, టీవీ డిబెట్లలోనూ గట్టిగా మాట్లాడే నేతలూ ఉన్నప్పటికీ అవి ఓట్లకు పనికొచ్చే మాటలు కాదని అంటుంటారు పరిశీలకులు. పైగా టీడీపీతో కలవాలని… వారికి జనసేన కూడా తోడవ్వాలని ఉభయ కమ్యునిస్టులూ పరితపించిపోటుంటారని అంటుంటారు. అది జరగదని తెలిసిన నాడు పవన్ పై ఫైరవుతుంటారు.
ఇలా ఏపీలోని విపక్షాలు అన్నీ పరిపూర్ణమైన అస్పష్టతతో రాజకీయాలు చేస్తుండటం… అధికార పక్షానికి స్పష్టమైన బలాన్ని ఇస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ… విపక్షాలనీఇ ఇదే అస్పష్టతను కంటిన్యూ చేస్తాయా.. లేక, స్పష్టమైన ప్రకటనలతో కూడిన రాజకీయాలు చేస్తూ మనుగడను కాపాడుకుంటాయా అన్నది వేచి చూడాలి.