ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా పాకిస్థాన్ ను అమెరికా కోరింది. ఎఫ్ – 16 విమానాలను తీవ్రవాద వ్యతిరేక పోరాటానికే ఉపయోగించాలని, ఇతర దేశాల పై దాడికి వాడరాదని అమెరికా షరతు విధించింది. దీనిని ఉల్లంఘించి భారత్ పై దాడి చేశారని అమెరికా తెలిసిందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ పై దాడికి ఎఫ్-16 విమానాలను ఉపయోగించలేదని పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ తమ ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడాన్ని కూడా పాక్ ప్రకటించింది. అయితే పాక్ ఆ విమానాలను వాడినట్టు భారత త్రివిధ దళాధిపతులు ఆధారాలతో సహా చూపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని పాక్ కు అమెరికా విధేశాంగ శాఖ ఆదేశించింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలు విక్రయించే అమెరికా వాటి వినియోగానికి సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాలను ఉల్లంఘించడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది. పాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటో అమెరికా చెప్పనప్పటికీ, దాదాపు 12 నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది. ఎఫ్–16 విమానాలను పాకిస్తాన్ బయట ఉపయోగించాలన్నా.. సైనిక విన్యాసాల్లో వినియోగించాలన్నా, మూడో దేశంపై ప్రయోగించాలన్నా ముందుగా అమెరికా ప్రభుత్వం అనుమతి పొందాలని గతంలో ఆ దేశ హోం శాఖలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఒబామా సర్కార్ 2016లో పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్–16 విమానాలు విక్రయించాలని నిర్ణయించింది. అయితే, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వీటిని భారత్‌పైకి ప్రయోగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ్యుల ఒత్తిడితో ఒబామా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. అప్పట్లో భారత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తర్వాత కొన్ని షరతులతో అమెరికా పాకిస్తాన్‌కు వీటిని విక్రయించింది.