సంచలన విషయాలు బయటపెట్టిన వైసిపి నేత అంబటి

వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ సర్కార్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ అధికార ప్రభుత్వం అక్రమంగా వ్యవహరిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఓట్ల నమోదు గడువు పొడిగింపుపై ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఆ వివరాలు కింద చదవండి.

ఓట్ల నమోదు గడువు ముగియడంతో మరో నెల రోజులు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు అంబటి తెలిపారు. కాగా 15రాష్ట్రాల్లో ఓట్ల నమోదు అమలు చేస్తున్నందున ఏపీ కి ప్రత్యేక అనుమతి సాధ్యం కాదన్నారు ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా. ఎన్నికలకు పది రోజుల ముందు వరకు కొత్త ఓట్ల నమోదు ఉంటుందని సిసోడియా తెలిపినట్టు అంబటి వెల్లడించారు. ఎన్నికల జిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబు దిట్ట కాబట్టి వైసిపి ఆందోళన చెందుతుందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అనే భయంతోనే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని ఆరోపించారు. పల్స్ సర్వ్, రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో కాల్స్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానాలను చెప్పేవారి ఓట్లను తొలగిస్తున్నారని మా అనుమానం అన్నారు అంబటి. రాష్ట్ర వ్యాప్తంగా 48.61లక్షల ఓట్ల తొలగించారని సంచలన ఆరోపణ చేసారు. కర్నూల్, చిత్తూరు, కడపలో లక్షల ఓట్లను తీసేశారు అని వెల్లడించారు.

రెవిన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ సానుభూతి పరుల ఓట్ల ను తొలగిస్తున్నారు అని అంబటి మండిపడ్డారు. డూప్లికేట్ ఓట్ల విషయంలో కొంత గందరగోళం ఉంది. నిజమైన ఓటరుకు అన్యాయం జరగకుండా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాము అని తెలిపారు. వ్యతిరేక ఓట్లని తొలగించి అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు అన్నారు. కింది స్థాయి సిబ్బంది మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో పనిచేయడం వల్ల నష్టం జరుగుతోంది అని ఆరోపించారు. ఎన్నికల సంఘం సమర్థవంతంగా పనిచేస్తున్నా యంత్రాంగం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.