ఆయన కోసం పార్టీలే క్యూ కడుతున్నాయ్.. ఆయనెవరో తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం నేతలందరూ ఆయా పార్టీల అధినేతల చుట్టూ ప్రధక్షిణాలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కానీ విచిత్రంగా పార్టీల అధినేతలందరూ టిక్కెట్టిస్తాం తమ పార్టీలో చేరమంటూ ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నారు. వినటానికి విచిత్రంగా ఉందా ? లేకపోతే నమ్మలేకపోతున్నారా ? అయితే, ఈ కథనం మీరు చదవాల్సిందే.

ఆర్ఎస్ఆర్ గా ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ఫేమస్ అయిన వ్యక్తి గురించే ఇదంతా. ఇంతకీ ఆయనేం చేస్తారంటే, ఏలూరులో ఒక పెద్ద కాలేజికి రిటైర్డ్ ప్రిన్సిపాల్. విద్యార్ధులకు విద్యబుద్ధులు నేర్పటం ఆయన వృత్తయితే ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందేలా చేయటం ఆయన ప్రవృత్తి. దాదాపు 30 ఏళ్ళ పాటు వృత్తిని, ప్రవృత్తిని ఎటువంటి అలుపు లేకుండా కొనసాగిస్తునే ఉన్నారు. అందుకే ఆర్ఎస్ఆర్ అంటే ఏలూరులోనే కాదు ఉభయగోదావరి జిల్లాల్లోనే తెలీని వాళ్ళు లేరు, అభిమానించని విద్యార్ధులు, వాళ్ళ తల్లిదండ్రులుండరు.

పేద విద్యార్ధులకు ఉచితంగా ఇంటి వద్దే ట్యూషన్లు చెప్పటం, ఫీజులు కట్టలేని వాళ్ళకి దశాబ్దాలుగా తానే ఫీజులు కడుతున్నారు. ఆయన ట్రాక్ రికార్డు చూసే పోయిన ఉపాధ్యాయ కోటాలో వామపక్షాలు ఎంఎల్సీగా నిలబెట్టాయి. ఆర్ఎస్ఆర్ పోటీలోకి దిగితే తిరుగేముంది ? అవతల టిడిపి తరపున చైతన్యరాజు పోటీ చేశారు. అయినా సరే ఆర్ఎస్ఆర్ దే గెలుపు. దాంతో అప్పటి నుండి ఆయన పేరు మారుమోగిపోతోంది. ఎందుకంటే, ప్రిన్సిపాల్ గా వచ్చి జీతమైనా, ఎంఎల్సీగా వస్తున్న జీతమైనా మొత్తం పేద విద్యార్ధులకు, పేద రోగులకే ఖర్చు చేసేస్తున్నారు. చివరకు ఆయన ఇంటిని సైతం హాస్టల్ గా మార్చేసిన గొప్పోడు ఆర్ఎస్ఆర్.

ఇక, ప్రస్తుతానికి వస్తే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకే అన్నీ పార్టీల కళ్ళు రామూ మాస్టార్ పై పడింది. అధికార పార్టీతో పాటు వైసిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్ అన్నీ పార్టీలు ఆర్ఎస్ఆర్ ఇంటిచుట్టు తిరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుండి టిక్కెట్టిస్తామంటూ పదే పదే అడుగుతున్నాయ్. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన రామూ మాస్టార్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? చేస్తే ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో తెలీక పార్టీలన్నీ టెన్షన్ పడిపోతున్నాయ్.